శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (11:14 IST)

తిరుమలలో పోటెత్తిన భక్తజనం - పట్టించుకోని తితిదే అధికారులు

వరుసగా నాలుగురోజుల పాటు సెలవు దినాలు రావడంతో కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో పోటెత్తింది. అంబేద్కర్‌ జయంతి నుంచి ఆదివారం వరకు వరుసగా సెలవులు రావడంతో భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమలలోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. 32 కంపార్టుమెంట్లు నిండిపోయి 3 కిలోమీటర్లకుపైగా లైన్లు బయటకు వచ్చేశాయి. కాలినడక భక్తుల కంపార్టుమెంట్లు కూడా నిండిపోయాయి. అలాగే తలనీలాలు ఇచ్చే కళ్యాణకట్ట వద్ద అదే పరిస్థితి. తలనీలాలు సమర్పించడానికి 5 గంటలకుపైగా సమయం తిరుమలలో పడుతోంది. 
 
గదులు లేకపోవడంతో భక్తులు రోడ్లపైనే సేదతీరుతున్నారు. అయితే వేసవి కాలం కావడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తుల ఉక్కపోతతో విలవిలలాడిపోతున్నారు. ఎప్పటిలాగే టిటిడి భక్తుల విషయంలో చేతులెత్తేసింది. తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. కొంతమంది భక్తులు  గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండగా మరికొంతమంది భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్నారు. గురువారం శ్రీవారిని 70,520 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.1.88 కోట్లు వసూలైంది.