గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 నవంబరు 2015 (11:08 IST)

తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. సోమవారం తెల్లవారుజామునే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. సూర్యోదయం కాకముందే నదులు, కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. 
 
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంతో పాటు పంచారామ క్షేత్రాలైన గుంటూరు జిల్లా అమరావతి, తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం, సామర్లకోట, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, భీమవరం తదితర క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెలంగాణలోనూ కీసర, వేములవాడ, కాళేశ్వరం సహా ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
 
అలాగే, కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని శ్రీసోమేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.