శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 మార్చి 2016 (09:26 IST)

శివరాత్రి పర్వదిన రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేస్తారు...

లయకారకుడైన పరమేశ్వరుడు లింగోద్భవం చెందిన పరమపవిత్ర దినం మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసంతో పాటు జాగరణ చేయడం ముక్తి ప్రదాయమని మన పురాణాలు పేర్కొంటున్నాయి. అయితే, శివరాత్రి రోజున ఉపవాస దీక్షతో శివనామస్మరణ చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తుంటారు. 
 
ఇలా ఎందుకు చేస్తారంటే... మానవ జీవితానికి రాజస, తామస గుణాలు ఎక్కువగా ప్రభావం కలిగిస్తాయి. రాజసం అంటే భావోద్వేగం, తామసమంటే అంధకారం. పగటివేళ రాజసం, రాత్రి వేళ తామస గుణాలు కలుగుతాయి. వీటిపై నియంత్రణకు ప్రణవ నాదాన్ని పూరించిన మహాశివుని భక్తిలో నిమగ్నం కావాలి. 
 
తామస వేళ కామం, ఆగ్రహం, అసూయ... తదితర వికృత గుణాలు మనిషిలో ప్రవేశిస్తాయి. అయితే వీటిని అధిగమించేందుకు పరమేశ్వరుడు చూపిన మార్గదర్శనమే శివరాత్రి ఉపవాసం, జాగరణ, పగలు,రాత్రి ఆ మహేశ్వరుని ధ్యానంలో వుంటే జీవితంపై నియంత్రణ కలిగివుంటామని దీని భావన. 
 
శివుడి మూర్తి, లింగమూ రెండూ సమానమైనవే. అయినా సాధకులకు లింగార్చనే శ్రేష్టమైనది. ప్రత్యేకంగా మోక్షాన్ని కోరుకునే వారికి పూర్తి పూజకంటే లింగార్చనే ఎంతో మేలు. శివలింగాన్ని ఓంకార మంత్రంతోనూ, శివమూర్తిని పంచాక్షరీ మంత్రంతోనూ పూజించటం సర్వశుభప్రదమని పురాణాలు చెపుతున్నాయి.