శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2016 (11:57 IST)

వైభవోపేతంగా పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఐదురోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో మొదటి రోజు రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి తెప్పలపై విహరిస్తూ భక్తులకు వరాలు ప్రసాదించారు. పద్మసరోవరంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపకాంతుల నడుమ తెప్పోత్సవం అత్యంత రమణీయంగా సాగింది.
 
అంతకు ముందు అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. శ్రీకృష్ణస్వామివారిని ప్రత్యేక పూజలతో ఆరాధించారు. శ్రీరుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులను ఆలయంలోని ముఖమండపంలో కొలువు దీర్చి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన శ్రీరుక్మిణీ, సత్యభామ సమేత స్వామివారి ఉత్సవమూర్తులను పద్మసరోవరానికి వేంచేపుగా తీసుకువచ్చి కొలువుదీర్చారు. శ్రీ పద్మావతి నామస్మరణలు నడుమ తెప్పోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి.
 
తిరుమలలో పోటెత్తిన భక్తులు 
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వారాంతం కావడంతో భక్తుల రద్దీ పెరిగిందని తితిదే భావిస్తోంది. సర్వదర్శనం కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి భక్తులు వెలుపల క్యూలైన్లలో బారులు తీరి కనిపిస్తున్నారు. కాలినడక భక్తుల కంపార్టుమెంట్లు కూడా అదే పరిస్థితి. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటల సమయం తితిదే ప్రకటించినా ఆ సమయం సాధ్యం కావడం లేదు. గురువారం శ్రీవారిని 74,356 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 78 లక్షల రూపాయలకు చేరింది.