బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 27 నవంబరు 2014 (18:56 IST)

పంచమి తీర్థంతో పులకించిన తిరుచానూరు

తిరుచానూరు జన సముద్రంలో మునిగిపోయింది. అమ్మవారి భక్తులు పంచమి తీర్థంతో తమ జన్మను పునీతం చేసుకున్నారు. లక్షల మంది భక్తులు పంచమి తీర్థం సందర్భంగా తిరుచానూరు పుష్కరణిలో స్నానమాచరించి తమ భక్తిని చాటుకున్నారు. సాధారణంగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పుష్కరణిలో స్నానం చేయిస్తారు. తిరుచానూరు చుట్టుపట్ల ఉన్న కొన్ని వందల గ్రామాల ప్రజలు పంచమి రోజున ఎక్కడ ఉన్నా, తిరుచానూరు చేరుకుని ఈ పుష్కరణిలో పుణ్య స్నానాలు చేస్తారు.
 
తిరుపతిలోని అన్ని విద్యా సంస్థలకు ప్రాంతీయ సెలవుదినంగా ప్రకటిస్తారు. దీంతో ఇటు ఉద్యోగులు కూడా ఉదయం నుంచి కోనేరు వద్ద క్యూ కడతారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. వందలు, పదులు, వేలూ కాదు కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తిరుచానూరుకు వస్తారు. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి కనీసం రెండు లక్షల మంది జనం తిరుచానూరు చేరుకున్నారు. 

 
తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు అమ్మవారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి చక్రం, శంఖు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగుంపుగా పుష్కరణికి తీసుకు వచ్చారు. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో అమ్మవారి చక్రాన్ని, ఉత్సవ విగ్రహాన్ని పద్మసరోవరం అయిన పుష్కరణిలో మునకలు వేయించారు. ఆ సమయంలో ఆ పుష్కరణిలో మునకలు వేయడానికి కొన్నివేల మంది పుష్కరణికి చేరుకుని వేచి ఉన్నారు. 
 
అమ్మవారిని మునకలు వేయించే సమయంలో తామూ మునిగి తమ సర్వ పాపాలను పొగొట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఈఎల్ నరసింహన్, టీటీడీ మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజి గోపాల్, జేఈవోలు పోలా భాస్కర్, శ్రీనివాస రాజు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.