శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (12:10 IST)

15 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను ఈనెల 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తితిదే సిద్ధమైంది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాల కళ్యాణ వేడుకలను పురస్కరించుకుని ప్రతియేటా పరిణయోత్సవాలను తితిదే నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీ మలయప్పస్వామి గజవాహనంపై, రెండోరోజు అశ్వవాహనంపై, చివరి రోజు గరుడవాహనంపై ఊరేగుతూ నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవ మండపానికి ఊరేగింపుగా వేంచేస్తారు.
 
శ్రీవారిని అనుసరిస్తూ శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల బంగారు పల్లకీపై చేరుకుంటారు. అనంతరం కన్నుల పండువగా, శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు పరిణయోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూడురోజుల పాటు శ్రీవారికి తోమాల, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్త్రదీపాలంకరణ సేవలను తితిదే రద్దు చేసింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా తితిదే నిర్వహించనుంది.