బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2015 (09:59 IST)

15న తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ

తిరుమల తిరుపతిలో వెలసిన కలియుగదైవం శ్రీవేంకటేశ్వస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం (15వ తేదీ) అంకురారోపణ జరుగనుంది. ఆ తర్వాత బుధవారం నుంచి 24వ తేదీ వరకు శ్రీవారివార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. దీంతో శ్రీవారి ఆలయంతో పాటు.. తిరుమలను అందంగా అలంకరించారు. దీంతో తిరుమల వైకుంఠాన్ని తలపిస్తోంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆదివారానికే పూర్తి చేశారు.


శ్రీవారి ఆలయం, నాలుగు మాడ వీధులతో పాటు కొండపై ఉన్న రహదారులన్నీ విద్యుద్దీపాలంకరణలతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. ప్రధాన కూడళ్ళలో దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఆకట్టుకున్నాయి. కళ్యాణవేదిక వద్ద పుష్ప ప్రదర్శనశాల దాదాపుగా పూర్తికావస్తోంది. అలాగే, వివిధ పురాణ ఘట్టాలను తెలిపేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. 
 
ముఖ్యంగా వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసే పుష్పప్రదర్శన భక్తులను కనువిందు చేయనుంది. ఈ ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన గరుత్మండుడి సైకతశిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నిజానికి ప్రతి యేడాది రంగరంగుల పుష్పాలతో వివిధ దేవతామూర్తుల బొమ్మలు, చిత్రాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, గత యేడాది నుంచి సైకతశిల్పాలను ఏర్పాటు చేస్తున్నారు. గత యేడాది భూవరాహస్వామివారి సైకత శిల్పం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఇదే విధంగా ఈ యేడాది కూడా సైకత శిల్పాలను తితిదే ఏర్పాటు చేస్తోంది. 
 
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ 2015... 
15-09-2015 మంగళవారం... సాయంత్రం.. అంకురారోపణ, సేనాధిపతి ఉత్సవం. 
 
1వ రోజు - 16-09-2015 బుధవారం... ఉదయం.. ధ్వజారోహణం, సాయంత్రం.. పెద్దశేష వాహనం
2వ రోజు - 17-09-2015 గురువారం... ఉదయం.. చిన్నశేష వాహనం, సాయంత్రం.. హంస వాహన సేవ
3వ రోజు - 18-09-2015 శుక్రవారం... ఉదయం.. సింహ వాహనం, సాయంత్రం.. ముత్యపుపందిరి వాహనం. 
4వ రోజు - 19-09-2015 శనివారం... ఉదయం.. కల్పవృక్ష వాహనం, సాయంత్రం.. సర్వ భూపాల వాహనం. 
5వ రోజు - 20-092015 ఆదివారం... ఉదయం.. మోహిని అవతారం, సాయంత్రం.. గరుడ సేవ. 
6వ రోజు - 21-09-2015 సోమవారం... ఉదయం.. హనుమంత సేవ, సాయంత్రం.. గజవాహనం. 
7వ రోజు - 22-09-2015 మంగళవారం... ఉదయం.. సూర్యప్రభ వాహనం, సాయంత్రం.. చంద్రప్రభ వాహనం. 
8వ రోజు - 23-09-2015 బుధవారం... ఉదయం.. రథోత్సవం, సాయంత్రం.. అశ్వ వాహనం. 
9వ రోజు - 24-09-2015 మంగళవారం... ఉదయం.. చక్రస్నానం, సాయంత్రం.. ధ్వజ అవరోహణం (బ్రహ్మోత్సవాలు ముగింపు).