గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 జనవరి 2016 (06:18 IST)

తిరుమలలో అంతా బ్రోకర్ల రాజ్యమేనా?.. జోరుగా బ్లాక్ మార్కెట్!

నిత్యం గోవిందనామ స్మరణలతో మార్మోగే తిరుమల గిరుల్లో ఇప్పుడు బ్లాక్ మార్కెట్‌ దందానే యధేచ్చగా సాగుతోంది. శ్రీవారి దర్శనం టిక్కెట్లు మొదలుకుని లడ్డు ప్రసాదాలు వరకు అంతా బ్లాక్‌మయమే. పాపభీతి అన్నది లేకుండా స్వామివారి సన్నిధిలో బ్లాక్‌ మార్కెట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. 
 
ముఖ్యంగా లడ్డు కావాలంటే దళారీలును ఆశ్రయించవలసిందే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఫలితంగా బ్రోకర్ల పంట పండిపోతోంది. టిటిడి యంత్రాంగం చేతకానితనానికి తోడు, కొందరు అధికారులు అండదండలు పుష్కలంగా ఉండటంతో బ్లోకర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. తమ వ్యాపారానికి ఏలాంటి ఢోకా లేకుండా కొనసాగిస్తున్నారు. 
 
వాస్తవానికి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు స్వామివారి ప్రసాదానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. రద్దీ రోజులలో అయితే స్వామి దర్శనం దొరక్కపోయినా కనీసం లడ్డూ ప్రసాదం దొరికితే అదే పది వేలని భావిస్తారు. ఆ క్రమంలో వెంకన్న లడ్డూ ప్రసాదానికి రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. శ్రీనివాసుని దర్శనార్ధం నిత్యం 60 వేల నుండి లక్ష మంది భక్తులు తరలివస్తూంటే తిరుమల లడ్లూ రెండున్నర లక్షల నుండి మూడున్నర లక్షల వరకు విక్రయిస్తుంటారు. 
 
వీటిని విక్రయించేందుకు అనేక విధానాలు అమలు చేసినా.. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా అవి తూతూ మంత్రంగా కొద్ది రోజులు పని చేసి.. ఆ తర్వాత మూసివేయడం పరిపాటిగా మారింది. ఇదే బ్రోకర్లకు కల్పతరువుగా మారిపోయింది. ఎప్పుడైతే అదనపు లడ్డూ కౌంటర్లలో విక్రయించే లడ్డూల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారో.. దళారీల సంఖ్య పెరిగిపోయింది తిరుమలలో దాంతో దర్శనానికి వెళ్ళిన భక్తులు దర్శనం దొరకని భక్తులు అదనపు లడ్డూలు కోసం దళారీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది.
 
ఇప్పుడు ఏడుకొండలపై దళారి వ్యవస్థ ఎంతగా పాతుకుపోయిందో జరుగుతున్న ఉదంతాలు చెప్పకనే చెపుతున్నాయి. అప్పుడప్పుడు మాత్రమే దాడులు నిర్వహించే విజిలెన్స్‌అధికారుల వలలో గత ఏడాది 102 మంది చిక్కారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక 27 మంది కాంట్రక్టు సిబ్బంది దళారిలుకు సహకరిస్తూన్నారంటూ వారిని ఉద్యోగం నుండి తొలగించారు కూడా. అలాగే 18 కేసులకు సంబంధించి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇక 50 మందికి పైగా టిటిడి, పోలిస్, హోంగార్డులపై శాఖాపరమైన చర్యలకు విజిలెన్స్‌ నివేదిక సమర్పించింది. ఇలా తిరుమలలో బ్లాక్ మార్కెట్ జోరుగా సాగుతుండగా, బ్రోకర్లు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు.