శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (10:29 IST)

అంగరంగ వైభవంగా ముగిసిన బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం...

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అఖిలాండ నాయకుడిని కనులారా చూసేందుకు లక్షల్లో భక్తులు తిరుమలకు తరలివచ్చి వెంకన్న సేవల్ని చూసి తరించారు. అంకురార్పణతో మొదలై ధ్వజ అవరోహణంతో పరిసమాప్తి అయ్యాయి. ప్రతీ రోజూ ఒక్కో వాహనాలపై ఒక్కో అలంకారంలో భక్కజనకోటికి శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. 
 
తొలిరోజు రోజు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొమ్మిది రోజుల పాటు 16 వాహనాలపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారి వాహనసేవల ముందు భక్తుల కోలాటాలు, వేశాధారణలు ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది గ్యాలరీల్లోకి వచ్చిన గంటలోనే భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం లభించింది. 
 
ఈ బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి హుండీలో 19 కోట్ల రుపాయల ఆదాయం వచ్చినట్టు తితిదే వెల్లడించింది. అలాగే, లడ్డూల విక్రయం ఈ ఏడాది రూ.22 లక్షల 65 వేలు జరిగింది. ఇక నిరంతరాయంగా భక్తులందరికి అన్నప్రసాద వితరణ చేసినట్టు తెలిపింది. బ్రహ్మోత్సవాలలో ఏ చిన్నపాటి ఘటన జరుగకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్టు ఈవో సాంబశివరావు వెల్లడించారు. 
 
బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక అక్టోబర్‌ 14 నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత వైభవంగా నిర్వహించే విధంగా ఇప్పటినుంచే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.