శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Yarram Reddy
Last Modified: సోమవారం, 15 డిశెంబరు 2014 (13:37 IST)

గోవిందా... ఒకేరోజు రెండు పండ‌గ‌లు... తిరుమలపై రద్దీ ఖాయం....

రెండు ప‌ర్వదినాలు ఒకేరోజు వ‌స్తే అబ్బో సెలవు పోయిందే అనుకునేవారు చాలామందే ఉంటారు. కానీ తిరుమ‌ల అధికారుల‌కు మాత్రం అదిరిపోతుంది. క‌నీసం ఊపిరి పీల్చుకోవ‌డానికి కూడా తీరిక ఉండ‌దు. స‌రిగ్గా ఇలాంటి సంఘ‌ట‌న వ‌చ్చే యేడాది ప్రారంభం రోజున అధికారులు ఎద‌ుర్కోబోతున్నారు. వైకుంఠ ఏకాద‌శి, ఆంగ్ల సంవ‌త్సరాది ఒకే రోజు రావ‌డంతో ర‌ద్దీ విప‌రీతంగా ఉండే అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవైపు విఐపిలు, మ‌రోవైపు సామాన్య భక్తజనానికి అవసరమైన సౌక‌ర్యాల‌ కోసం తిరుమ‌లతిరుప‌తి దేవ‌స్థానం అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు.
 
సాధార‌ణంగా అయితే జ‌న‌వరి 1న టాలీవుడ్ ప్రముఖులు, రాజ‌కీయ ప్రముఖులు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకుని త‌మకు యేడాదంతా శుభం క‌ల‌ుగాల‌ని కోరుకుంటారు. అదేస‌మయంలో వైకుంఠ ఏకాద‌శి కూడా రావ‌డంతో ఇటు త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి జ‌నం క్యూ క‌ట్టే అవ‌కాశం ఉంది. క‌నీసం 3 ల‌క్షల మంది భక్తులు ఇక్కడ‌కు రావ‌చ్చని అంచ‌నా వేస్తున్నారు. 
 
అదే స‌మయంలో స్థానికులు వైకుంఠ ద్వార ద‌ర్శనం కోసం ఎగ‌బ‌డ‌తారు. ఇలా తిరుమలకు చేరుకునే భ‌క్తుల కోసం ఏర్పాట్లను అధికారులు ప‌ర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్ల ఏర్పాటు, నీరు, ఆహారం వంటి వాటిపై ఇప్పటికే చ‌ర్చలు జ‌రుపుతున్నారు.