శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: మంగళవారం, 24 మే 2016 (16:03 IST)

మే 27న వేదనారాయణ స్వామి వారి ఆలయంలో పుష్పయాగం

తితిదేకి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో మే 27వ తేదీన పుష్పయాగ మహోత్సవాన్ని తితిదే నిర్వహించనుంది. ఇందుకోసం మే 26వ తేదీన సాయంత్రం 6.30గంటలకు అంకురార్పణ నిర్వహించనుంది. పుష్పయాగం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. 
 
ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1గంట వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, తేనె, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు స్వామివారి పుష్పయాగం జరుగనుంది. ఈ సంధర్భంగా పలు రకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు పుష్పాలతో అభిషేకం చేస్తారు. 
 
అనంతరం రాత్రి  7 గంటల నుంచి 8.30 వరకు వీధి ఉత్సవం జరుగనుంది. శ్రీ వేదనారాయణస్వామి వారి ఆలయంలో ఈ యేడాది ఏప్రిల్‌ 22 నుండి 30వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్య కైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల అధికార, అనధికారుల వల్ల, భక్తుల  తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.