మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2015 (16:12 IST)

కేరళకు ''గాడ్స్ ఓన్ కంట్రీ'' అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోండి!

పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారమైన పరుశురాముడు సముద్రాన్ని వెనక్కి నెట్టి కేరళను వెలికితీశాడని కథనాలున్నాయి. అందమైన ప్రకృతితో... నిత్యం వేలాది మంది పర్యాటకులను ఆకర్షించే కేరళకు ఇతర దేశాల నుంచి సిరియన్‌ మలబార్‌ క్రైస్తవులు, ముప్పిల్ ముస్లిమ్‌ సమాజం, ట్రావెన్‌ కోర్‌ రాజులు వలస వచ్చారు.

వీరి పాలనలో కేరళ మహర్దశను సంతరించుకుంది. క్రీ.పూ 10 శతాబ్దంలోనే నాగరికత వెల్లివిరిసింది. అనంత పద్మనాభస్వామికి దాసునిగా ప్రకటించుకున్న ట్రావెన్‌ కోర్‌ రాజ వంశీకులు, రాజ్యం ఆయనదేనని, ఆయన సేవకులుగా తాము పాలిస్తున్నామని చెప్పేవారు. అందువల్లే కేరళ దేవుడి సొంత దేశమైంది. 
 
ఆయుర్వేదం, పంచకర్మ చికిత్సలకు ప్రసిద్ధి చెందిన కేరళలో మరో ప్రత్యేక ఆకర్షణ బోట్‌ రేస్‌లు. ప్రపంచంలోనే గ్రేటెస్ట్‌ టీమ్‌ స్పోర్ట్‌గా ఆరన్‌ముళ బోట్‌ రేస్‌ నిలిచింది. కేరళ రాష్ట్రమంతా, సంవత్సరం పొడవునా టూరిస్టులను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఒక్క శబరిమల ఆలయానికి సంవత్సరంలో రెండు కోట్ల మందికి పైగా వస్తుంటారు.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతుడైన దేవుడు త్రివేండ్రంలో అనంత పద్మనాభుని రూపంలో కొలువైవున్నాడు. ఈయనకు ఉన్న ఆభరణాలు, ఆస్తుల విలువకు ఇంతవరకూ లెక్కే కట్టలేదు. వందలాది దేవాలయాలు, కన్నులకింపైన ఉత్సవాలు నిత్యమూ జరుగుతూ ఉండే కేరళ, వరల్డ్ టాప్-50 టూరిస్ట్ డెస్టినేషన్‌లలో ఒకటి. 
 
1498లో సుగంధ ద్రవ్యాల వర్తకం కోసం వాస్కోడగామా కేరళ తీరానికి వచ్చాడు. ఆపై డచ్చి, పోర్చుగీసు వారి యుద్ధాలో డచ్చివారిదే పైచేయి. తదుపరి బ్రిటీష్ వారు కాలుమోపారు. స్వాతంత్ర్యానంతరం 1956 నవంబర్‌ 1న కేరళ రాష్ట్రం ఏర్పాటైంది. దేశంలోనే పూర్తి అక్షరాస్యత సాధించిన దేశమైన కేరళకు పర్యాటకం విషయంలోనూ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్నాయి. 
 
దట్టమైన అడవులు, పర్వతాలు, జలపాతాలకు ఈ రాష్ట్రం నిలయం. ఏవిధమైన డెల్టాలూలేని కేరళలో మొత్తం 44 నదులు పారుతుంటాయి. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నదీ ముఖ ద్వారాలు (బ్యాక్ వాటర్స్) రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశాయి. దేశంలోని జల మార్గాల్లో 8 శాతం కేరళలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. 
 
10 వేలకు పైగా వృక్షజాతులు, 900 రకాలకు పైగా ఔషధ మొక్కలకు కేరళ ప్రసిద్ధి. కథాకళి, కూడియాట్టం, కేరళ నటనం, మోహినీయాట్టం, తుల్లాల్‌, పాదయని, తెయ్యరు వంటి ప్రత్యేక కళారూపాలు అందరినీ ఆకర్షిస్తాయి. అందుకే కేరళ 'గాడ్స్ ఓన్ కంట్రీ'. అయ్యింది.