శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (17:47 IST)

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు.. కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్.బి.ఐ

ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం.. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం.. క్రూడ్‌ ఆయిల్‌ రేట్లు పతనమవ్వడం.. పనామా పేపర్స్‌ లీక్‌ వ్యవహారం బయటపడటంతో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఫలితంగా బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్‌ సూచీ 516 పాయింట్ల మేరకు నష్టపోయి 24883 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 7603 వద్ద ముగిశాయి. బీపీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్‌, లుపిన్‌ షేర్లు లాభపడగా.. అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు నష్టపోయాయి. 
 
అంతకుముందు... భారత రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం వెల్లడించారు. రెపోరేటు పావు శాతం తగ్గి 6.75 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. రివర్స్ రెపో రేటును పావుశాతం పెంచారు. నగదు నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పు లేదని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. రెపోరేటు 0.25 శాతం తగ్గడంతో గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది.