శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (10:30 IST)

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్: విశ్వవిజేతగా మాగ్నస్ కార్ల్‌సన్ గెలుపు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలలో నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ గెలుపొందారు. ప్రపంచ చెస్‌లో రారాజుగా వెలుగుతున్న ఆనంద్‌కు 23 ఏళ్ల కార్ల్‌సెన్ వరుసగా రెండోసారి షాకిచ్చి తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. 
 
డ్రాతో మొదలైన 12 గేమ్‌ల ఈ చాంపియన్‌షిప్ తొలి గేమ్‌లో పాయింట్లను పంచుకున్న ఆనంద్ రెండో గేమ్‌లో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. అయితే, మూడో గేమ్‌లో ఎదురుదాడికి దిగి విజయం సాధించడంతో స్కోరు సమమైంది. 
 
4, 5 గేమ్స్‌లు డ్రా కాగా, ఆరో గేమ్‌లో గెలిచిన కార్ల్‌సెన్ రెండోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఇక ఏడో గేమ్‌లో ఇద్దరు ఆటగాళ్లు 122 ఎత్తుల వరకు పోరాటాన్ని కొనసాగించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ చరిత్రలోనే ఇది అతి సుదీర్ఘమైన పోరుగా రికార్డుకెక్కిన ఈ గేమ్ చివరికి డ్రాగా ముగిసింది.
 
ఆ తర్వాత 8, 9, 10 గేమ్‌ల్లోనూ ఫలితం వెల్లడి కాకపోవడంతో, ఆనంద్‌కు 11వ గేమ్ అత్యంత కీలకంగా మారింది. అత్యంత కీలకమైన 11వ గేమ్‌లో ఛాలెంజర్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓటమిపాలు కావడంతో కార్ల్‌సెన్‌కు ఈ కిరీటం మరోసారి దక్కింది.