మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (11:09 IST)

అంతర్జాతీయ టెన్నిస్ క్రీడకు గుడ్‌బై చెప్పిన చైనా స్టార్ లీ నా!

చైనా టెన్నిస్ క్రీడాకారిణి, యువ సంచలనం లీ నా తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. సుదీర్ఘకాలంగా బాధపెడుతున్న గాయాలు, ప్రత్యేకంగా మోకాలి గాయం మరింత బాధిస్తున్నందువల్లే శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు తెలిపింది. టెన్నిస్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన లీ నా గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఏకైక ఆసియా క్రీడాకారిణి కావడం విశేషం. 
 
తన రిటైర్మెంట్‌పై ఆమె శుక్రవారం బీజింగ్‌లో మాట్లాడుతూ.."ఈ ఏడాది నాకు చాలా కష్టమైనది. చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. వాటివల్లే నేను నా టెన్నిస్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నాను" అని తెలిపినట్లు చైనీస్ టెన్నిస్ అసోసియేషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. తను వైదొలగేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నానని పేర్కొంది. 
 
ఓ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణిగా పోటీ రంగం నుంచి ఈ సమయంలో వదిలి వెళ్లాలనుకోవడం సరైన నిర్ణయంగా భావిస్తున్నానని చెప్పింది. తన కుడి మోకాలి నొప్పి బాగా వేధిస్తున్నందువలనే మేనేజ్ చేయలేకపోతున్నానని లీ నా ప్రకటనలో వివరించింది. ముప్పై రెండేళ్ల లీనా 2011 ఫ్రెంచ్ ఓపెన్, ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లను గెల్చుకుంది. చైనాలో ఆమెను "బిగ్ సిస్టర్ నా", "గోల్డెన్ ఫ్లవర్"గా పిల్చుకుంటారు.