శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (09:24 IST)

కామన్వెల్త్ క్రీడలు : వెయిట్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్.. 4వ స్థానంలో భారత్!

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ శుభారంభం చేసింది. తొలి రోజు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 6 కేటగిరీల్లో పతకం కోసం పోటీలు నిర్వహించగా భారత్ 4 పతకాలతో సత్తా చాటింది. వాటిలో రెండు స్వర్ణ పతకాలు ఉండటం విశేషం. మహిళల 48 కిలోల విభాగంలో సంజిత పసిడి సాధించగా, సైకోమ్ చాను రజితం దక్కించుకుంది. అలాగే, పురుషుల 56 కిలోల కేటగిరీలో సుఖేన్ డే స్వర్ణం చేజిక్కించుకోగా, అదేవిభాగంలో గణేశ్ మాలి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 
 
ఇకపోతే.. భారత్ జూడో క్రీడాంశంలో మూడు పతకాలు కైవసం చేసుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో నవ్‌జోత్ చనా, మహిళల 48 కేజీల విభాగంలో సుశీలా లిక్మబామ్ రజతాలు గెలుచుకున్నారు. ఇక, మహిళల 52 కిలోల విభాగంలో కల్పనా తౌడమ్ కాంస్యంతో సరిపెట్టుకుంది. దీంతో, తొలిరోజు భారత్ ఖాతాలో మొత్తం ఏడు పతకాలు చేరాయి. 
 
కాగా, పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. రెండు బంగారు, మూడు వెండి, రెండు రజతంలతో మొత్తం ఏడు పతకాలు కైవసం చేసుకుంది. అగ్రస్థానంలో ఇంగ్లండ్ ఉంది. ఈ దేశం మొత్తం ఆరు బంగారు పతకాలతో మొత్తం 17 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా, మూడో స్థానంలో స్కాట్‌లాండ్ దేశాలు ఉన్నాయి.