శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 జులై 2015 (13:11 IST)

హాకీ వరల్డ్ పోటీలు: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

హాకీ వరల్డ్ లీగ్ పోటీల్లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉత్కంఠ భరితంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో జస్జీత్ సింగ్ అదుర్స్ డబుల్‌తో భారత్ 3-2 తేడాతో మలేషియాపై గెలుపును నమోదు చేసుకుంది. ఆటలో పూర్తి ఆధిక్యాన్ని సంపాదించిన మలేషియాకు చివర్లో భారత క్రీడాకారులు చుక్కలు చూపించారు. భారత్ పుంజుకోవడంతో మ్యాచ్‌ భారత్ కైవసం అయ్యింది.  
 
మ్యాచ్ ప్రారంభమైన 3వ నిమిషంలోసత్బీర్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో ఖాతా తెరిచాడు. ఆకాష్‌దీప్‌ సింగ్‌ ఇచ్చిన పాస్‌ను సత్‌బీర్‌ నేరుగా గోల్‌లోకి పంపాడు. కానీ 15 నిమిషంలో కెప్టెన్‌ రహీమ్‌ రజీ.. పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 1-1తో స్కోరు సమం చేశాడు. అలాగే సహ్రిల్‌ సాబా గోల్‌ సాధించడంతో 2-1 తేడాతో మలేషియాకు ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో మూడో క్వార్టర్‌ వరకు మలేసియాదే పైచేయిగా సాగింది. అయితే నాలుగో క్వార్టర్ ప్రారంభమైన 3 నిమిషాలకే టీమిండియాకు పెనాల్టీ కార్నర్ ద్వారా సువర్ణావకాశం లభించింది. జస్జీత్‌ దానిని గోల్‌గా మలచి స్కోరు సమం చేశాడు. 
 
ఇక మ్యాచ్‌ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా.. జస్జీత్‌ మరో పెనాల్టీ కార్నర్‌తో గోల్‌ చేయడంతో భారత్‌కు 3-2 ఆధిక్యం లభించింది. భారత్‌పై మరింత ఒత్తిడి పెంచడానికి చివరి రెండు నిమిషాల్లో మలేసియా గోల్‌ కీపర్‌ నుంచి అదనంగా మరో స్ట్రయికర్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది. దాడుల ఉధృతి పెంచి చివరి 38 సెకన్లలో మలేసియా పెనాల్టీ కార్నర్‌ సంపాదించడంతో ఒక్కసారిగా ఉత్కంఠ రేగింది. కానీ దాన్ని గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ తిప్పికొట్టడంతో టీమిండియాకు విజయం లభించింది.