బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2016 (08:54 IST)

సింధు కోసం ప్రత్యేక విమానం.. ఏర్పాటు చేసిన చంద్రబాబు సర్కారు

రియో ఒలింపిక్స్ పోటీల్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో దేశానికి రజత పతకం సాధించి పెట్టిన భారత షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు రాత్రికి రాత్రే ఓ స్టార్‌గా మారిపోయింది. ఫలితంగా ఆమెను రెండు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక అతిథిగా పరిగణిస్తున్నాయి. అంతేనా పోటాపోటీగా ఘనంగా సన్మానాలు చేస్తున్నాయి. 
 
బ్రెజిల్ నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న సింధుకు తెలంగాణ సర్కారు ఘనస్వాగతం పలికింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం దాకా ఆమెను భారీ ర్యాలీ నడుమ తీసుకెళ్లింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింత ఘనంగా స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేసింది. 
 
ఇందుకోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానం కూడా సిద్ధం చేసింది. ఇందులో సింధుతో పాటు ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్, సింధు కుటుంబ సభ్యులు విజయవాడకు వస్తారు. ఈ విమానం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతుంది. ఇక ఈ ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకోగానే సింధు, గోపీచంద్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లుచేసింది.