శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (13:06 IST)

సైనా నెహ్వాల్-గోపీచంద్ గురుశిష్య బంధం తెగిపోయింది!

భారత బ్యాడ్మింటన్ క్రీడలో అత్యంత విజయవంతమైన గురుశిష్యుల బంధం తెగిపోతోంది. తన గురువు పుల్లెల గోపీచంద్‌తో బంధాన్ని హైదరాబాద్ షట్లర్ సైనా నెహ్వాల్ తెగతెంపులు చేసుకుంది. గోపీచంద్ శిష్యరికంలో ఆమె దేశానికి పలు పతకాలు సాధించి పెట్టారు. గోపీచంద్‌ను వదిలేసి ఆమె విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనా నెహ్వాల్ దాదాపు 20వరకు అంతర్జాతీయ టైటిళ్లను సొంతం చేసుకుంది. త్వరలో ఆసియా క్రీడలు జరగనున్న నేపథ్యంలో ఆమె ప్రస్తుతం భారత జట్టు మాజీ కోచ్ విమల్ కుమార్ వద్ద బెంగళూర్‌లో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
కాగా టైటిళ్ల సాధనలో ఆశించినట్లు రాణించకోవడంతోనే గోపీచంద్‌ కోచ్‌కు సైనా నెహ్వాల్ గుడ్ బై చెప్పేసిందని తెలుస్తోంది. ఇటీవల డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల సందర్భంగా ఆ విషయాన్ని సైనా గోపీచంద్‌కు చెప్పినట్లు సమాచారం. ఆయన కూడా అందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. 
 
ఇటీవలి కాలంలో సైనా తన పాత ఫామ్‌ను కోల్పోవడంతో పాటు పివి సింధు లాంటి క్రీడాకారిణులు ముందుకు దూసుకుపోతున్నారు.ఆ నేపథ్యంలోనే సైనా పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు.
 
ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల నుంచి ఆమె క్వార్టర్ ఫైనల్స్ దశలోనే వెనుదిరిగారు. ఉబెర్ కప్ సమయంలో విమల్ కుమార్ ఇచ్చిన సలహాలు ఉపయోగపడ్డాయని, అయితే ఆసియా క్రీడలు ముగిసిన తర్వాత మళ్లీ హైదరాబాద్ వస్తానని సైనా చెప్పినట్లు తెలుస్తోంది.
 
గోపీచంద్‌తో సైనా విడిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2011లో భాస్కర బాబు వద్ద శిక్షణ తీసుకోవాలని సైనా భావించారు. అయితే, మూడు నెలల తర్వాత తిరిగి గోపీచంద్ వద్దకు వచ్చేశారు. ప్రస్తుతం తాను కేవలం 15 రోజుల శిక్షణ కోసమే తాను బెంగళూర్ వెళ్తున్నానని, అది దీర్ఘకాలికం అయ్యే అవకాశం కూడా లేకపోలేదని సైనా అంటున్నారు.