శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2014 (11:30 IST)

మహిళా జిమ్నాస్ట్‌కు లైంగిక వేధింపులు.. ఇద్దరు కోచ్‌లపై వేటు!

దేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ మహిళా జిమ్నాస్ట్‌కు తనకు శిక్షణ ఇచ్చే కోచ్‌ల నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొంది. దీనిపై జిమ్నాస్టిక్ బోర్డు పెద్దలకు ఫిర్యాదు చేసిన ఫలితం దక్కలేదు. దీంతో ఆ మహిళా క్రీడాకారిణి పోలీసులను ఆశ్రయించడంతో ఇద్దరు కోచ్‌లపై చర్యలు ప్రారంభమయ్యాయి. 
 
శిక్షణ ఇస్తూ వచ్చిన ఇద్దరు కోచ్‌లైన మనోజ్ రాణా, చంద్రన్ పాఠక్‌లు మహిళా జిమ్నాస్ట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆ కామాంధులు, సదరు జిమ్నాస్ట్‌పై లైంగిక వేధింపులకూ దిగారు. విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అయితే చివరకు ఆ జిమ్నాస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ కామాంధులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, రెండు వారాలుగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కాక, సదరు ఫిర్యాదు బయటకు రాకుండా తొక్కిపెట్టారు. 
 
ఇక లాభం లేదనుకున్న మహిళా జిమ్నాస్ట్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఆసియాడ్ క్రీడల కోసం ఇంచియాన్ వెళ్లిన నిందితులు మనోజ్ రాణా, చంద్రన్ పాఠక్‌లను తక్షణమే తిరిగి రావాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతిష్టాత్మక టోర్నీలో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండానే నిందితులు వెనుదిరగాల్సి వచ్చింది.