శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (17:47 IST)

రజత పతకం తీసుకుని బేసిక్ కుదుఖోవ్ కుటుంబాన్ని బాధపెట్టను : యోగేశ్వర్ దత్తా

భారత రెజ్లర్, 2012 లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ అద్భుతమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్‌కు దక్కిన రజత పతకాన్ని తీసుకున

భారత రెజ్లర్, 2012 లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ అద్భుతమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్‌కు దక్కిన రజత పతకాన్ని తీసుకుని ఆ రెజ్లర్ కుటుంబాన్ని మరింతగా బాధపెట్టబోనని ప్రకటించాడు. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ పోటీల్లో పలువురు రష్యా ఆటగాళ్లు పాల్గొనలేక పోయారు. దీనికి కారణం డోపింగ్ పరీక్షల్లో పట్టుబడటమే. ఈ నేపథ్యంలో 2012 లండన్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో రజత పతకం సాధించిన బేసిక్ కుదుఖోవ్ డోపింగ్‌లో విఫలమయ్యాడని ఫలితాలు వెల్లడయ్యాయి. 
 
ఇంతలో బేసిక్ కుదుఖోవ్ 2013లో రష్యాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడటం ఇక్కడ గమనార్హం. దీంతో ఆ కుటుంబం ఆ విషాదం నుంచి ఇంకా తేరుకోలేదు. అదేసమయంలో అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య, ఒలింపిక్ యాంటీ డోపింగ్ కమిటీలు అతని నుంచి రజతపతకం తీసుకుని, ఆ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం గెలుచుకున్న యోగేశ్వర్ దత్‌కు దానిని ఇవ్వాలని నిర్ణయించింది. 
 
దీనిపై యోగేశ్వర్ దత్ స్పందిస్తూ... బేసిక్ కుదుఖోవ్ మంచి రెజ్లర్ అని తెలిపాడు. డోపింగ్ ఫలితాలు ఇంత ఆలస్యంగా విడుదల కావడం, ఆయన భౌతికంగా లేకపోవడంతో ఆ పతకం తీసుకుని, ఆ కుంటుబాన్ని మరింత విషాదంలోకి నెట్టవద్దని, ఆ పతకం కుదుఖోవ్ కుటుంబం వద్ద ఉండటమే సముచితమని అభిప్రాయపడ్డాడు. ఈ సమయంలో మనమంతా మానవతాదృక్పథంతో నడచుకోవాలని ఆయన సూచించాడు. దీంతో యోగేశ్వర్ దత్ గొప్ప మనసుపై భారత్, రష్యా క్రీడాకారులు, అభిమానులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.