లగడపాటి సర్వే... ఆ విధంగా బయటడిపోయిన బాబు.!

chandrababu naidu
Last Modified గురువారం, 6 డిశెంబరు 2018 (12:33 IST)
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలు వేళ తెలంగాణలో ఒక సంచలనమయ్యాయి. సర్వేకు సంబంధించి తిరుపతిలో తొలుత మాట్లాడిన లగడపాటి.. తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల హవా నడుస్తుందని చెప్పుకొచ్చారు. పార్టీ టిక్కెట్లు పొందని 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తున్నారని వెల్లడించారు. రోజుకో ఇద్దరి పేర్ల చొప్పున బయటపెడతానని.. సమగ్ర ఫలితం మాత్రం పోలింగ్ జరిగే 7వ తేదీనాడు చెబుతానని ప్రకటించారు. అయితే దానికి భిన్నంగా ఎన్నికలకు మూడు రోజుల ముందు తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంశాన్ని తేల్చేశారు.

ఆంధ్ర ఆక్టోపస్ ఎన్నికలకు ముందే కూయడం వెనుక ఎవరిదైనా హస్తముందా అనే అనుమానాలు ఒక్కసారిగా తలెత్తాయి. ఇక, లగడపాటి తాజా సర్వే ఫలితాలు టీఆర్ఎస్ కీలకనేత కేటీఆర్‌కైతే కంపరమే పుట్టించాయి. లగడపాటిది చిలకజోస్యం అని చెబుతూ నవంబర్ మొదటివారంలో వీరిరువురి మధ్య నడిచిన వాట్సాప్ సందేశాల పరంపరను లీక్ చేశారు కేటీఆర్. సదరు సంభాషణ స్క్రీన్ షాట్లను ట్విట్టర్లో విడుదల చేస్తూ.. ఎన్నికలకు నాలుగురోజుల ముందు చంద్రబాబు.. లగడపాటితో ఆడిస్తున్న గిమ్మిక్కు అంటూ మండిపడ్డారు.

దీంతో హుటాహుటీన రంగంలోకి దిగిపోయిన ఆంధ్ర ఆక్టోపస్, అమరావతిలో అనుకున్నది హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి తమ మధ్య జరిగిన వాట్సప్ సంభాషణ పూర్తి వివరాలు, అంతకుముందు తనకు-కేటీఆర్‌కు జరిగిన వ్యవహారం మొత్తాన్ని మైకుల ముందు పెట్టేశారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని, తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలంటే తనకు భయం లేదన్నారు. తాను పూర్తి నిష్పాక్షికంగా సర్వే నిర్వహించానని ఏ పార్టీకి నష్టం చేకూర్చాలనిగాని, మేలు చేయాలనికాని తన అభిమతం కాదన్నారు.

అంతేకాదు, టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడానికి గల కారణాలను సైతం క్యాసెట్ వేశారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు అందకపోవడం వంటి వాటిని కారణాలుగా చూపించారు.
లగడపాటి వ్యాఖ్యలపై వెంటనే కేటీఆర్ ట్విట్టర్లో కౌంటరిచ్చారు. గోబెల్స్‌కే పెద్దన్న లాంటి చంద్రబాబు ఇటు తన అనుకూల మీడియా సంస్థలతో పాటు అటు సోషల్ మీడియాలో ఇంకా చాలా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. వాళ్లు చేసే తప్పుడు ప్రచారంతో గందరగోళపడవద్దు అని తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి.

స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణను కాపాడుతుందంటూ కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే, వీరిద్దరి మధ్య వార్ జరుగుతుండగానే ఏపీ సీఎం చంద్రబాబు సర్వే అంశంలోకి తలదూర్చారు. సండ్ర వెంకట వీరయ్యకు మద్దతుగా సత్తుపల్లిలో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న చంద్రబాబు.. లగడపాటి సర్వే ఫలితాల్ని ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్ అయింది.

కేటీఆర్ చెప్పిందే జరిగిందని.. ఎన్నికలకు నాలుగురోజుల ముందు లగడపాటి-చంద్రబాబు కలిసి కొత్త డ్రామాకి తెరతీశారంటూ గులాబీ దండు కన్ఫామ్ అయిపోయింది. సర్వే లెక్కలు చెప్పేవాడు టీఆర్ఎస్ ప్రాభవం ఎందుకు తగ్గిందో..
దానికి గల కారణాలు కూడా మీడియా ముఖంగా వల్లెవేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ టీఆర్ఎస్ మద్దతుదారులు మండిపడుతున్నారు.దీనిపై మరింత చదవండి :