పోలింగ్ ప్రారంభం : మొరాయించిన ఈవీఎంలు... ఓటేయకుండా వెనుదిరుగుతున్న ఓటర్లు

voter ink mark
Last Updated: శుక్రవారం, 7 డిశెంబరు 2018 (08:59 IST)
తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పోలింగ్‌కు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పటిష్ట బందోబస్తు నడుమ పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల విధుల్లో 2 లక్షలమంది సిబ్బంది నిమగ్నమైవున్నారు. కొన్ని చోట్ల సాయంత్రం 4 గంటలకు, మరికొన్ని చోట్లు సాయంత్రం 5 గంటలతో పోలింగ్ ముగియనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో(13 నియోజకవర్గాల్లో) మాత్రం 4 గంటలకే నిలిపివేస్తారు. ఈ ఎన్నికల్లో తొలిసారి వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల తన ఓటు ఎవరికీ పడిందీ తెలుసుకునే వీలు ఓటరుకు ఉంటుంది.

కాగా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో మొత్తం 55,329 బ్యాలెట్ యూనిట్లు, 42,751 వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్నారు. శేరిలింగంపల్లిలో అత్యధిక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, భద్రాచలం నియోజకవర్గంలో అత్యల్ప పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి బరిలో అత్యధికంగా 42 మంది, బాన్సువాడలో అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారు.

అలాగే, హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 3,873 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 280 పోలింగ్ కేంద్రాలున్నాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో 1821 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ 119 స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 99, టీడీపీ 13, టీజేఎస్ 8, సీపీఐ 3, ఎంఐఎం 8, బీజేపీ 118, బీఎస్పీ 107,
సీపీఎం 26, ఎన్‌సీపీ 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

25 నియోజకవర్గాల్లో 15 మందిలోపు పోటీ చేస్తుండగా, 76 నియోజకవర్గాల్లో 16 నుంచి 31 మంది పోటీ చేస్తున్నారు. 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో 32 కంటే ఎక్కువమంది బరిలో ఉన్నారు. 16 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉన్న చోట రెండు ఈవీఎంలను వినియోగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,41,56,182 మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,39,05,811 మంది. ఈ నెల 11న ఫలితాలను ప్రకటించనున్నారు.

అయితే, అనేక పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు సరిగా లేదు. దీంతో ఓటర్లు ఓటు వేయకుండానే పోలింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు. మొరాయిస్తున్న ఈవీఎంలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలో కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.దీనిపై మరింత చదవండి :