శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Modified: శనివారం, 26 జులై 2014 (19:38 IST)

ఆదిలాబాద్ జిల్లాలో మావోల అలజడి మళ్లీ మొదలయ్యిందా..?

అదిలాబాద్ జిల్లాలో మావోయిస్ట్ కార్యాకలపాలు ఊపందుకుంటున్నాయి. ఆజాద్ ఎన్‌కౌంటర్ తర్వాత జిల్లాలో మావోయిస్ట్ ప్రాబల్యం తగ్గిందనుకున్న తరుణంలో వారం రోజులుగా మావోలు అడవులలో సంచరిస్తూ అలజడి సృష్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూర్ మండలంలోని ప్రాణహిత నది నుంచి మావోయిస్టులు జిల్లాలో ప్రవేశించినట్లు జిల్లా పోలీసులకు సమాచారం అందింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు జరుగుతుండటంతో ఎలాగైనా తిరిగి తమ ఉనికిని కాపాడుకోవడం కోసం దాడులు చేసే అవకాశం వుందని ఇంటలిజెన్స్ వర్గాల సమాచారంతో జిల్లా పోలిస్ యాంత్రాంగం అప్రమత్తమైంది.
 
ఆజాద్ ఎన్‌కౌంటర్ తర్వాత జిల్లాలో మావోయిస్ట్ కదలికలు తగ్గుతూ వచ్చాయి. తాజాగా మళ్లీ ఇప్పుడు రెండు యాక్షన్ టీంలు బలోపేతం చేసుకోవడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కార్యకలపాలు తిర్యాణి అటవి ప్రాంతాం నుంచి జరుగుతున్నట్లు తెలుస్తుంది. తిర్యాణి మండలానికి చెందిన మంగి దళ కమాండర్ చార్లెస్ అలియాస్ ఆత్రం శోభన్ తమ దళాన్ని తిరిగి చాపకింద నీరులాగా విస్తరింపచేస్తున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. 
 
ఆత్రం శోభన్ కు మహరాష్ట్ర, చత్తీస్ ఘడ్ మావోయిస్టులతో మంచి సంబధాలు వుండటంతో వీటిని నిలువరించడానికి జిల్లా పోలీసులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆధ్వర్యంలో తిర్యాణి అడువుల్లో ప్రత్యేక టీం గాలింపు చర్యలు మమ్మురం చేసింది.
 
ఇప్పటికే జిల్లాలో మావోయిస్టులు ప్రవేశించినట్లు సమాచారం వుందని జిల్లా ఎస్పీ గజరావ్ భూపాల్ పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతంలోని అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టామని అటవీ ప్రాంతంలో నివసించే గ్రామాల ప్రజలు మావోయిస్టులకు భయపడి వారికి ఆశ్రమం కల్పించవద్దని ఎస్పీ సూచించారు.
 
ఇప్పటివరకు జిల్లాలో 10 మంది మావోయిస్టులు సంచరిస్తున్నారని జిల్లా ఎస్పీ అధికారంగా చెపుతున్నా అనాధికారంగా 100కి పైగానే మావోయిస్టులు సంచరిస్తున్నట్టు తెలుస్తుంది. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి గత కొంతకాలంగా తమ దళాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది.