బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (16:39 IST)

హరీష్ రావుపై అక్బరుద్దీన్ ఫైర్ : రేవంత్ స్పీచ్‌కు తెరాస సభ్యుల అడ్డు!

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుపై ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. మరోవైపు.. భూముల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమాలు బయటపడతాయన్న భయంతో తనను సభలో మాట్లాడనీయకుండా తెరాస సభ్యులు అడ్డుకుంటున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. 
 
అంతకుముందు ఉద్యోగాల కల్పన పైన మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభలో మజ్లిస్ పార్టీ కోరగా.. 344 కింద నోటీసు ఇచ్చిన సభ్యులే మాట్లాడాలని సభాపతి మధుసూదనాచారి చెప్పారు. దీంతో అక్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ పైన అందరితో ఎలా మాట్లాడించారని ప్రశ్నించారు. నోటీసు ఇచ్చిన వారే మాట్లాడాలని బీఏసీలో నిర్ణయించామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 
 
దీంతో అక్బర్ భగ్గుమన్నారు. బీఏసీలో నిర్ణయించింది నిజమైతే రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు. సభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు మాట్లాడకుండా అడ్డుకునే క్రమంలో మమ్మల్ని కూడా అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ తాము సభ నుండి వాకౌట్ చేస్తున్నట్లు చెప్పారు. 
 
మరోవైపు.. తెలుగుదేశం పార్టీ సభ్యుడు రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు ఉపక్రమించగా.. తెరాస సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభాపతి సభను అరగంట పాటు వాయిదా వేశారు. కాగా, నిజాలు బయటపడతాయని రేవంత్ రెడ్డిని సభలో ప్రభుత్వం మాట్లాడనివ్వలేదని టీడీపీ నేతలు ఆరోపించారు.