గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:54 IST)

తెలంగాణాలో దొంగల రాజ్యం : మల్లు భట్టి విక్రమార్క!

తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారని, ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో దొంగల రాజ్యం నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు అధికారం ఇస్తే తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు తెలంగాణ వనరులను ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారని గగ్గోలు పెట్టిన తెరాస అధినేత కేసీఆర్ ఇపుడు రాష్ట్రంలోని వనరులను కేసీఆర్ కుటుంబం మాత్రమే దోపిడీ చేస్తోందని ఆరోపించారు. 
 
అధికారంలోకి రాకముందు తెలంగాణాలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్‌ను కొనుగోలు చేసి, దాన్ని రాష్ట్రానికి తరలించేందుకు ప్రత్యేక విద్యుత్ లైను వేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఇపుడు ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. 
 
ప్రజలు, ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. డెంగ్యూ, ఇతర వైరల్ వ్యాధులతో ప్రజలు బాధపడుతుంటే, ఓ మంత్రి మాట్లాడుతూ.. డెంగ్యూ వ్యాధి రాష్ట్రంలో లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వ్యాధి బారిన పడి టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం ప్రభుత్వానికి తెలియదా? అని మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు.