మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (13:09 IST)

ఏం తమ్మీ... అంతా గిట్లయ్యింది... గెలుపుపై గుబులు...

'ఏం తమ్మీ అంతా గిట్లయ్యింది.. వేరే పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించిన వాళ్ళలో టిక్కెట్ వచ్చినా మనకేం పెద్ద ఇబ్బంది ఉండదనుకున్నాం. గెలుపు పక్కా మనుకుంటిమి. ఒక్క రోజులోనే అనూహ్యంగా మనకు గట్టి పోటీనిచ్చే అభ్యర్థిని ప్రత్యర్థి పార్టీ రంగంలోకి దించింది. ఇక ప్రచారంలో జోరు పెంచితేనే ఏమైనా ఫయిదా (గెలుపు) ఉంటుంది'.. ఇది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ సన్నిహితుల వద్ద చేస్తున్న వ్యాఖ్యలు. 
 
మొత్తం 119 అసెంబ్లీ సీట్లున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అశావహుల్లో ఎవరికో ఒకరికి టిక్కెట్ దక్కుతుందని అందరూ భావించారు. ఇక్కడే కొన్ని పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. గెలుపే ధ్యేయంగా కొత్త ముఖాలను అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చాయి. ఈ అనూహ్య పరిణామంతో ఎవరికీ లాభం జరుగుతుందంటూ ఎవరికీ వారే అంచనాలు వేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలను తేలిగ్గా తీసుకున్నామంటూ ఇపుడు లబోదిబోమంటున్నారు. గెలుపు కోసం మరింతగా చెమటోడ్చాల్సిందేన్న నిర్ణయానికొచ్చారు. ఆ మేరకు వ్యూహాలను పదును పెడుతున్నారు. 
 
అదేసమయంలో అన్ని రాజకీయ పార్టీలు గ్రేటర్ హైదరాబాద్‌పై దృష్టిసారించాయి. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచి తమ సత్తాను చాటుకునేందుకు ముందు నుంచే పక్కాగా అడుగులు వేశాయి. 2014 ఎన్నికల తర్వాత తెరాస పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. చేరికలను భారీగా ప్రోత్సహించింది. ఫలితంగా బల్దియా ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. అందరికంటే ముందే 8 స్థానాలకు మినహా మిగిలిన అన్ని చోట్లా అభ్యర్థులను ప్రటించి సంచలనం సృష్టించింది. 
 
అలాగే, బద్ధశత్రువులుగా ఉండే కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ జతకట్టింది. పొత్తుల్లో భాగంగా ఆ పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గాలను కేటాయించింది. భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి ఒంటరిగా బరిలోకి దిగింది. ఆయా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఆశావహులు ఎవరికి వారే ఈసారి పరిస్థితులు తమకే అనుకూలంగా ఉన్నాయంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.