గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (17:41 IST)

ఫాస్ట్‌పై హైకోర్టు వ్యాఖ్యలు.. తెలంగాణాకు తలవంపులు : డాక్టర్ లక్ష్మణ్

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫాస్ట్’ పథకంపై రాష్ట్ర హైకోర్టు ఘాటైన విమర్శలు చేయడం తెలంగాణా రాష్ట్రానికే తలవంపులని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేత డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ఇది జాతీయ సమగ్రతకు విఘాతం కలిగించే విషయమని అనడం తెలంగాణ ప్రభుత్వానికి తలవంపులు వంటివన్నారు. 
 
ఫాస్ట్ పథకంపై హైకోర్టు తాజా వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘ఫాస్ట్’ పథకాన్ని ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత వైఖరికి నిదర్శనమన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును కోర్టులు ఇప్పటికి ఐదుసార్లు తప్పు పట్టాయని లక్ష్మణ్ గుర్తు చేశారు. కోర్టుల్లో ఎదురు దెబ్బలు ఎదురవుతున్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఒంటెత్తు పోకడలను, ఏకపక్ష వైఖరిని మానుకోవడం లేదన్నారు. 
 
స్థానికత అంశంలో కేసీఆర్ భేషజాలు, పట్టింపులకు పోవడం, లేనిపోని రాద్ధాంతం చేయడం మంచిది కాదని లక్ష్మణ్ కేసీఆర్‌కి హితవు చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో ఏర్పడిన గందరగోళానికి తెరదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.