శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 28 డిశెంబరు 2018 (11:44 IST)

హైదరాబాద్‌లో భారీ పేలుడు... ఉలిక్కిపడిని ఫిలిమ్ నగర్...

హైదరాబాద్ ఫిలింనగర్ బసవతారకనగర్‌లో వంట గ్యాస్ సిలెండర్ భారీ శబ్ధంతో పేలింది. ఈ పేలుడుతో చుట్టు ప్రక్కల వారు  భయాందోళనకు గురయ్యారు. వంట చేస్తుండగా గ్యాస్ సిలెండర్ పేలడంతో ఈ పేలుడు ధాటికి రెండు ఇళ్లు ధ్వంసం అయి ఏడుగురికి గాయాలు అయ్యాయి. పేలుడు ధాటికి శిథిలాలు మరో ఇంటిపై పడి నలుగురు చిన్నారులు గాయాలపాలవడంతో ఆస్పత్రికి తరలించారు. వివరాలు పరిశీలిస్తే... బీహార్‌కు చెందిన అబ్దుల్, సాజిద్, నిసార్, ఇలియాస్ అనే నలుగురు యువకులు బతుకుదెరువు కోసం ఏడాది క్రితం నగరానికి వచ్చి కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. 
 
ఈ నలుగురు కలిసి ఒకే రూమ్‌ను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పనుల నుంచి రాత్రి ఇంటికి తిరిగొచ్చి.. వంట చేసేందుకు సిద్దమయ్యారు. అప్పటికే గ్యాస్ లీక్ కావడంతో గమనించకుండా స్టవ్ వెలిగించారు. గదంతా గ్యాస్ నిండిపోయి మంటలు అంటుకున్నాయ్. రూమ్‌లో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. గ్యాస్ పేలుడు ధాటికి ఇంటిపైకప్పు రేకులు పగిలి ఎగిరిపోయాయ్. ఇంటి గోడల్లోని ఇటుకలు గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న తిరుపతయ్య ఇంటిపై పడడంతో నలుగురు చిన్నారుల తీవ్రంగా గాయపడ్డారు. 
 
కాలిన గాయాలపాలైన నలుగురు బీహార్‌కు చెందిన యువకులతో పాటు, శిథిలాలతో గాయపడ్డ ముగ్గురు చిన్నారులను కూడా చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీకై పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నా, గ్యాస్ సిలిండర్ పేలుడు కాకపోవచ్చని.. పేలుడు పదార్థాలను తయారుచేస్తుంటే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు స్థానికులు. పేలుడుకి గల కారణాలు దర్యాప్తులో తేలుతుందని చెప్తున్నారు పోలీసులు.