శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: గురువారం, 11 ఫిబ్రవరి 2016 (21:21 IST)

టి.తెదేపా 10వ వికెట్ డౌన్... తెరాసలోకి రాజేందర్ రెడ్డి, షాక్‌లో తెదేపా

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. నిన్న ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్ ఇద్దరూ తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా 10వ వికెట్ డౌన్ కాబోతోంది. నారాయణ్ పేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. గులాబీ కండువా కప్పుకున్నారు. ఇదిలావుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోపల కొద్దిసేపటి క్రితం జరిగిన తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో తెదేపా పరిస్థితి ఎంతమాత్రం బాగా లేదన్నారు. అలాగే తెలంగాణలో ఎన్నికలు వస్తుంటాయనీ, మరోవైపు రోజుకొకరు జంప్ అంటూ మాట్లాడారు. 
 
ఎవరికి వారే యమునా తీరే అని పరిస్థితి తలెత్తిందని రాజేందర్ రెడ్డి చెప్పారు. మా మనో నిబ్బరం దెబ్బతిన్నదని కూడా చెప్పుకొచ్చారు. అధికారంలో లేనప్పుడు నిబ్బరంగా ఉండాలని చెప్పిన రాజేందర్ రెడ్డి కట్ చేస్తే తెరాస తీర్థం పుచ్చుకోవడం తెదేపాకు పెద్ద షాక్ తగిలినట్లయింది. కాగా రాజేందర్ రెడ్డి మీద పలు కేసులున్నాయనీ, తెరాస తీర్థం పుచ్చుకోకపోతే చర్యలు ఉంటాయంటూ ఒత్తిడి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
 
అంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నదనీ, పార్టీకి కార్యకర్తలే బలం అని అన్నారు. అలాగే ఒకరిద్దరు నాయకులు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ ఉండదన్నారు. ఆయన అలా మాట్లాడిన కొద్దిసేపటికే రాజేందర్ రెడ్డి తెరాసలో చేరిపోవడం ఆశ్చర్యం.