శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 19 నవంబరు 2015 (11:53 IST)

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనుంది. ఈనెల 21వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌కు రెండు రోజుల ముందు ప్రచారం నిషేధం. ఈ నేపథ్యంలో ఈసీ నిబంధనల ప్రకారం అన్ని పార్టీలు నడుచ్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కోరారు.
 
దీనిపై ఆయన మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుందని, 21న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు చెప్పారు. ఐదు గంటల తర్వాత ఇతర వ్యక్తులెవ్వరూ వరంగల్ లోక్‌సభ పరిధిలో ఉండరాదన్నారు. ఓటరుగా ఉన్న రాజకీయ నేతలు ఇంట్లోనే ఉండాలన్నారు. పార్టీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని.. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగవద్దని కోరారు.
 
ఇదిలావుండగా, పోలింగ్ కోసం మొత్తం 1,778 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లందరికీ ఇంటింటికీ తిరిగి బూత్ స్లిప్‌లు అందించామని, 94 శాతం పంపిణీ పూర్తయిందన్నారు. ఓటేసేందుకు వెళ్లినప్పుడు ఏదైనా గుర్తింపు కార్డు తప్పకుండా తీసుకెళ్లాలన్నారు. బందోబస్తుకు 20 కంపెనీల పారా మిలటరీ, సెంట్రల్ ఫోర్స్‌ను రంగంలోకి దింపామన్నారు.
 
వరంగల్ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 21న పోలింగ్ రోజు వరకు, ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే 23న సాయంత్రం 5 గంటల నుంచి 24 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించామని భన్వర్‌లాల్ తెలిపారు. ఇప్పటి వరకు తనిఖీల్లో రూ.2 కోట్లు పట్టుకున్నామని తెలిపారు. మీడియాలో పార్టీలు ఎలాంటి ప్రకటనలు ఇవ్వవద్దని, పెద్దసంఖ్యలో ఎస్‌ఎంఎస్ పంపవద్దని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై 1800425227247 అనే టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి చెప్పొచ్చన్నారు.