గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (10:07 IST)

ఓటుకు నోటు కేసు: మత్తయ్యకు టీఏసీబీ హామీ.. నోటీసులే.. అరెస్ట్ చేయం!

ఓటుకు నోటు కేసులో విచారణలో హాజరుకావాలంటూ ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ అధికారులు ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. తాజాగా శుక్రవారం ఈ కేసు ఫైలు బూజు దులిపిన టీ ఏసీబీ, విచారణకు హాజరుకావాలంటూ ఉప్పల్‌లోని మత్తయ్యకు నోటీసులు జారీ చేసింది. 
 
విచారణకు పిలిచి ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంలో మళ్లీ మత్తయ్య ఏపీ పారిపోవచ్చని భావించిన ఏసీబీ అధికారులు... ఆ నోటీసుల్లో ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మిమ్మల్ని అరెస్ట్ చేయబోమని ఏసీబీ మత్తయ్యకు హామీ ఇచ్చింది. అంతేకాక న్యాయవాదితో కలిసి విచారణకు రావచ్చని కూడా ఆయనకు తెలిపింది.
 
ఈ కేసు వెలుగు చూసిన వెంటనే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మత్తయ్య ఏపీకి తరలివెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచే మత్తయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని తన అరెస్ట్‌ను నిలువరించుకున్నారు. ఆ తర్వాత కాని ఆయన హైదరాబాదులో అడుగుపెట్టలేదు.