శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (21:40 IST)

కేసీఆర్ చెప్పిందే వేదం... గ్రేటర్ రిజల్ట్స్... తెదేపా, కాంగ్రెస్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా...?

తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం తెరాసకు నీరాజనాలు పట్టారు. రాష్ట్రం ఏర్పడింది మొదలు వరుసబెట్టి తెరాస గులాబీ రంగును రాష్ట్రమంతటా వ్యాపింపజేసుకుంటూ వెళ్లిపోతోంది. రికార్డు ఫలితాలను సృష్టించి ఇతర పార్టీలకు ముచ్చెమటలు పట్టించింది. గ్రేటర్ పరిధిలోని ప్రజలంతా తమ బిడ్డలేననీ, తెరాసను గుండెల్లో పెట్టుకుని ఓట్లు వేసిన ప్రతివారికి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
 
గ్రేటర్ ఎన్నికల్లో 150 స్థానాలకు గాను కేసీఆర్ చెప్పిన సంఖ్యకు ఒక్కటి తక్కువగా 99 స్థానాలు గెలుచుకుని అగ్రస్థానాన నిలబడటమే కాకుండా మేయర్ స్థానాన్ని తన ఖాతాలో వేసేసుకుంది. ఆ తర్వాత స్థానంలో ఎంఐఎం 41 స్థానాల్లో గెలుపొందగా భాజపా 3, తెదేపా 1, కాంగ్రెస్ 2 స్థానాలను కైవసం చేసుకుని ఉన్నా లేనట్లే అనిపించుకున్నాయి. 
 
వ్యవహారం చూస్తుంటే భవిష్యత్తులో ఆ పార్టీలకు తెలంగాణలో గడ్డు రోజులు ఎదురయ్యేట్లు కనబడుతోంది. ఈ ఎన్నికలతో సీమాంధ్రులు తెరాసను నిరాదరిస్తారనే మాటలకు కూడా చెల్లు చీటి పలికినట్లయింది. ఇక చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయిలో ఇక్కడే పని చేసుకుంటే బెటర్ అని కేసీఆర్ అన్నట్లు ఆయన ఏపీకి పరిమితమయితే సరే... లేదంటే ఇప్పటికే కాపు రిజర్వేషన్ గొడవతోపాటు రైతులు, డ్వాక్రా మహిళలు మెల్లమెల్లగా అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నారు. వీటిపై దృష్టి సారించి ముందుకు కదిలితే ఏపీలో పరిస్థితి స్థిరంగా ఉంటుంది. లేదంటే ఇప్పటికే కాపు కులస్తులు క్రమంగా ఒక్కటవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇలాంటి స్థితి కొనసాగితే ఏపీలోనూ తెదేపాకు కష్టకాలం ఎదురుకాక తప్పదని అనుకోవచ్చు.