శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (10:05 IST)

తెలంగాణాలో కోవిడ్ ఉధృతి - కొత్తగా 2207 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొవిడ్‌-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 2,207 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేసమయంలో  1,136 మంది కోలుకోగా, 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,257కి చేరింది. ఆసుపత్రుల్లో 21,417 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 53,239 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 601కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 532 కరోనా కేసులు, రంగారెడ్డి జిల్లాలో 196 కేసులు నమోదయ్యాయి.
 
ఏపీలో 2 లక్షలకు చేరువలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత మళ్లీ అధికమైంది. కొన్నిరోజులుగా పాజిటివ్ కేసులు తగ్గుతున్న సూచనలు కనిపించినా, కొత్త కేసుల సంఖ్య మళ్లీ 10 వేలు దాటుతోంది. గడచిన 24 గంటల్లో 10,328 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
 
తూర్పు గోదావరి (1,351), కర్నూలు (1,285), అనంతపురం (1,112) జిల్లాల్లో పాజిటివ్ కేసులు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,96,789కి చేరింది. 
 
అటు మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగించే రీతిలో ఉంది. తాజాగా 72 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1,753కి పెరిగింది. కొత్తగా 8,516 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 82,166 మంది చికిత్స పొందుతున్నారు.