శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 2 జులై 2015 (09:37 IST)

కాంగ్రెస్‌కు డీఎస్ రాజీనామా... కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణా వచ్చింది!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మూడు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. అందులో తాను పార్టీ వీడుతున్న విషయాన్ని తెలిపారు. నాలుగు దశాబ్దాల పాటు తనకు పలు పదవులిచ్చిన కాంగ్రెస్ పార్టీకి లేఖలో డీఎస్ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. పైగా, తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణితి, కార్యదక్షత లోపించాయన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయడం లేదన్నారు. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రాన్ని ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రజాప్యం చేసిందని, దీనివల్ల పార్టీకి తీవ్రనష్టం వాటిల్లినట్టు డీఎస్ తన లేఖలో పేర్కొన్నారు. తెరాస అధినేత కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణా సాధ్యమైందని, అందువల్ల బంగారు తెలంగాణా కోసం కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. 
 
అంతేకాకుండా, నాలుగు దశాబ్దాలకుపైగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషిచేశాను. రెండు మార్లు పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించి పార్టీని అధికారంలో తీసుకొచ్చాను. అయినా నాకు ఏ మాత్రం గౌరవం లేకుండా పోయింది. వైఎస్‌కు సీఎం పదవి ఇచ్చినా.. నాకు ఎలాంటి ప్రాధాన్యం లేని గ్రామీణాభివృద్ధి శాఖ పదవితో సరిపెట్టారు. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదు. 
 
ముఖ్యంగా ఇటీవలి కాలంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్ నా విషయంలో పదేపదే అడ్డుపడుతున్నారు. నాతో వ్యవహరిస్తున్న తీరు ఎంతో బాధ కలిగించింది. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో మహిళా కార్డును ప్రయోగించి సీనియర్ నేతనైన నాకు పదవి రాకుండా అడ్డుకున్నారు. 
 
నా జిల్లాకు చెందిన ఆకుల లలితకు టికెట్ ఇచ్చిన విషయాన్ని మాట వరుసకైనా చెప్పకుండా అవమానపర్చారు. మీతో కలిసేందుకు అపాయింట్ మెంట్ కోసం నెలన్నరగా ప్రయత్నం చేస్తున్నా కూడా... ఇప్పటివరకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. పార్టీ కోసం ఎంతో చేస్తే.. చివరకు నాకు ఇచ్చే గౌరవం ఇదేనా? అందుకే పార్టీ వదలాలని నిర్ణయం తీసుకున్నా అని సోనియాకు రాసిన లేఖలో డీఎస్ పేర్కొన్నారు. మిమ్మల్ని కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని కూడా సోనియాకు రాసిన లేఖలో డీఎస్ హెచ్చరించినట్లు తెలిసింది. 
 
అటు సోనియాకు లేఖ పంపి, ఇటు ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న మరికొందరు నాయకులు కూడా డీఎస్ బాటలోనే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నిజామాబాద్, హైదరాబాద్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు త్వరలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి.