మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Modified: మంగళవారం, 29 జులై 2014 (13:29 IST)

మగపిల్లలు కావాలా... ధూపం బాబా దగ్గరకు వెళితే చాలట...

అమాయక జనాల అవసరాలను ఆసరగా చేసుకుని నాటు వైద్యులు, నకిలీ బాబాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. మంత్రాలు, తంత్రాలు, చేతబడి అంటూ వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. తెలియనితనంతో బాబాలను, నాటువైద్యులను నమ్ముకుని జనాలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా మహబూబ్‌నగర్ జిల్లాలో ధూపం బాబా హల్‌చల్ చేస్తున్నాడు.
 
మహబూబ్‌ నగర్ జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లికి చెందిన సాంబశివుడు ఏడవ తరగతి వరకూ చదవుకున్నాడు. 20 ఏళ్ల సొంత ఊరు విడిచి కొత్తకోటకు వలస వచ్చాడు. అక్కడ నాటువైద్యుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. దీనికితోడుగా జ్యోతిష్యం చెప్పటం, భూతవైద్యం చేయటం మొదలుపెట్టాడు. తన వద్దకు వచ్చే రోగులకు దెయ్యం పట్టిందనీ, చేతబడి చేశారనీ.. గాలిసోకిందనీ.. మంత్రాలు చేయటం తావీదులు కడుతూ డబ్బులు వసూలు చేయటం ప్రారంభించాడు. 
 
ఇక వైద్యం చేయాలని మంత్రాలు వేయాలంటూ దానికి కావాల్సిన సామాగ్రి అంతా తానే సరఫరా చేసి డబ్బులు దండుకుంటున్నాడు. విచిత్రమేమంటే మగపిల్లలు పుట్టేందుకు సైతం మందులు, మంత్రాలు వేస్తాడూ మన ధూపం బాబా. గుమ్మడి కాయలు, రాగిరేకులు, తమలపాకులు, వక్కలు, గవ్వలు ఇలా క్షుద్రపూజలకు అవసరమయ్యే సామాగ్రిని ఇవ్వటం తలపై చేయిపెట్టి వచ్చిన కాడికి దోచుకుని సాగనంపటం మనవాడి పని. ఇక తన వద్దకు వచ్చే వారిని ఓ పెద్దడాక్టర్‌లాగా ఫోజులిస్తూ నాడి పరీక్షిస్తాడు. 
 
ఆ పని అయ్యాక ఏమీలేదు... కాస్తా గాలి సోకిందని మంత్రాలు చేయటం విభూతి బొట్టుపెట్టి పంపిస్తాడు. ఇక వచ్చిన అమాయక జనాలను తన మాయమాటలతో గారడీ చేసి బుట్టలో వేస్తాడు. తమ కుమారుడు తప్పిపోయాడని అతని పాస్‌పోర్టు సైజు ఫోటో తీసుకుని ఇద్దరు దంపతులు బాబా దగ్గరకు వచ్చారు. ఆ ఫోటో తీసుకుని చూసి మీ వాడికి చెడువారితో స్నేహం చేస్తున్నాడు. వారితో కలిసి తిరగకుండా చూస్తే ఏం కాదుపో అంటూ.. అభయమిచ్చి నుదుడికి విభూతి బొట్టుపెట్టి వారి వద్ద ఇచ్చినకాడికి పుచ్చుకున్నారు. 
 
అగ్రహారం గ్రామానికి చెందిన శివలీల గత కొంత కాలంగా పిచ్చిపిచ్చగా చేస్తుందని ఈ బాబా వద్దకు తీసుకొచ్చారు. ఆమె కూడ తన భర్తను పక్కనే పెట్టుకుని తన భర్తను ఎవరో తీసుకుని పోయారంటూ హంగామా చేసింది. వెంటనే మన బాబాగారు అక్కడికి వచ్చి ఆమెను పరిక్షించారు. అయితే అమాయక జనం మాత్రం తాము ఇక్కడికి వస్తే రోగాలు నయం అవుతున్నాయని చెబుతున్నారు. 
 
ఇక ధూపం సాంబశివుడి గురించి ప్రత్యేకంగానే చెప్పాలి. ఆధునిక వైద్యం అందుబాటులో ఉండి గుండె మార్పిడి చేస్తున్న నేటిరోజుల్లో కూడ ఈ వైద్యం ఏంటని ప్రశ్నిస్తే నీళ్లు నములుతున్నాడు. ఇక అతడు చెప్పే నీతి మాటలు వింటే బుట్టలో పడిపోవటం ఖాయం. మట్టి ఒకటే కాని కుండలు వేరు... బంగారం ఒక్కటే కాని ఆభరణాలు మాత్రం వేరు... ఆత్మ ఒకటే కాని మనుషులు వేరు.. కాబట్టి ఒకరొకరు ఓ రకమైన వైద్యం చేస్తారని చెబుతున్నాడు. అమాయక జనం దొంగబాబాలను నమ్మినన్ని రోజులు ఇలాంటి దొంగబాబాలు పుట్టగొడుగుల్లో పుట్టుకురావటం ఖాయం. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.