గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (06:18 IST)

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం డీకే అరుణకే?

తెలంగాణ బీజేపీ ప్రజా సమస్యలపై పోరాటాన్ని గతకంటే ఉధృతం చేసింది. ఏ చిన్నఅవకాశం చిక్కినా రోడ్డెక్కి ఆందోళనలకు సై అంటోంది. ప్రభుత్వ వైఫ‌ల్యాలు, మున్సిపల్ చట్టం, ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మహ‌త్యలు, విద్యుత్ కొనుగోలు అంశం ఇలాంటి అనేక అంశాలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇప్పటికే పలు కార్యక్రమాలకు రాష్ట్ర మ‌హిళా మోర్చ అధ్యక్షురాలు ఆకుల విజ‌య‌, మాజీ మంత్రి డీకే అరుణ పోరాటాలకు శ్రీకారం చుట్టారు..
 
ఇందిరాపార్క్ దగ్గర దీక్ష.. ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం లాంటి కార్యక్రమాలు ఇద్దరు కలిసే చేస్తున్నారు.. దిశా హత్యను నిందితులు మద్యం మత్తులోనే చేసారన్న వార్తల నేపథ్యంలో ఇందిరా పార్కు దగ్గర రెండు రోజుల దీక్ష చేయ‌బోతున్నారు మాజీ మంత్రి డీకే అరుణ.

ఈ కార్యక్రమానికి ఆకుల విజయ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.. లోక్‌సభ ఎన్నికల తరువాత హైద‌రాబాద్‌లో పెద్దగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించన మాజీ మంత్రి డీకే అరుణ.. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఆందోళన కార్యక్రమాలు చేప‌డుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యక్రమాల నిర్వహణలో ఆంతర్యమేంటన్నది పార్టీలో పెద్ద చ‌ర్చ అవుతోంది..
 
పార్టీలో ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. మరో రెండు వారాల్లో పార్టీకి నూతన అధ్యక్షుడి ఎన్నిక కూడా జరుగబోతోంది. ఈ పోటీలో ప్రస్తుత అధ్యక్షుడు ల‌క్ష్మణ్ తర్వాత ఆ స్థానం కోసం పోరాడుతున్న రెండో వ్యక్తిగా డీకే అరుణే అన్న వార్తలు వినిపిస్తన్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో కూడా ఇద్దరు నేతలు పోటాపోటీగా లాబీయింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ లక్ష్మణ్‌కు అధిష్టానం ప‌ద‌విని రెన్యువల్ చేయ‌వ‌ద్దని భావిస్తే అధ్యక్ష పీఠం డీకే అరుణకే వ‌స్తుందన్న అభిప్రాయంలో ఉన్నట్టు అనుచరులు చెబుతున్నారు.
 
ఆందోళ‌న కార్యక్రమాలతో అధిష్టానం దృష్టిలో పడితే మరోసారి మహిళా మోర్చా అధ్యక్షురాలు కావచ్చు అనేది ఆకుల విజయ మనసులో మాట అని తన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఉద్యమాలతో దూసుకుపోయే విధంగా ఫ్యూచర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందిరాపార్క్ దగ్గర వీరి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు దీక్ష చేయాలని నిర్ణయించారు.

ఈ నెల 12, 13 తేదీల్లో భారీ జన సమీకరణతో దీక్షను విజయవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు మహిళ నేతలు. ప్రభుత్వాన్ని ఎదుర్కునేందుకు ఒక బలమైన వాయిస్ ఉండాలని.. అది మహిళది అయితే ప్రజ‌ల్లోకి మ‌రింత విస్తృతంగా వెళ్తుందన్న ద్దేశాన్ని అధిష్టానానికి కల్పించే విధంగా వీరు కార్యక్రమాలు చేపడుతున్నార‌ని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.