శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By chitra
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (13:24 IST)

మూడుసార్లు పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. హైదరాబాద్ పోలీసుల కఠిన చర్య

మందుబాబులూ.. ఇకపై జర జాగ్రత్తగా ఉండాలి. పీకలవరకు మద్యం సేవించి రోడ్లపై ఇష్టానుసారంగా వాహనం నడిపుతామనుకుంటే ఇకపై పప్పులుడకవ్. మందుబాబులపై కఠిన వైఖరిని అవలంభించాలని హైదరాబాద్ నగర పోలీసులు భావించడమే ఇందుకు కారణం.
 
ఇంతకాలం... చలాన్లు, కోర్టు కేసులతో నెట్టుకొచ్చారు. అయినా మందుబాబుల్లో మార్పు రావడం లేదని గుర్తించిన పోలీసులు వీరిపై మరింత ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా మూడు సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి జాబితాను పోలీసులు సిద్ధం చేసి ఈ వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని ఇటీవల స్థానిక ప్రాంతీయ రవాణా కార్యాలయ ఉన్నతాధికారులకు (ఆర్టీఏ)కు సిఫార్సు చేశారు.
 
పోలీస్ శాఖ సిఫార్సు మేరకు 81 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేసినట్లు జేటీసీ రఘునాథ్ వెల్లడించారు. లైసెన్సులు రద్దు అయిన వాహనచోదకుల్లో ఖైరతాబాద్‌లో 31 మంది, సికింద్రాబాద్‌లో 14 మంది, మెహిదీపట్నంలో 9 మంది, బండ్లగూడలో 11 మంది ఉండగా, మలక్‌పేట ఆర్టీఏ పరిధిలో 16 మంది వాహనదారులు ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దయిన వీరంతా తిరిగి మూడు నెలల వరకు మళ్లీ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అనర్హులుగా పరిగణించనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై మరింత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు చెప్పారు.