శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 31 జులై 2014 (12:12 IST)

ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల : టి సర్కారు ఝులక్!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత మూడు నెలలుగా కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎంసెట్ విద్యార్థులకు ఊరట కలిగింది. ఉన్నత విద్యామండలి బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 7 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. 
 
మొదటి రోజు 1 నుంచి 5 వేల ర్యాంక్‌ వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. కౌన్సెలింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ లో 34, తెలంగాణలో 23 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 2,15,336 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కు హాజరుకానున్నారు. 
 
ఇదిలావుండగా, ‘‘తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను మేమే నిర్వహించుకుంటాం.. ఈ విషయంలో ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనాల్సిన అవసరం లేదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, విద్యామండలి ఛైర్మన్ కలిసి ఆడుతున్న నాటకమిది..’’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
అసలు కాలేజీలకు అనుమతులు ఇవ్వకముందే కౌన్సెలింగ్ ప్రక్రియ ఏమిటని ప్రశ్నించింది. తెలంగాణలోని కళాశాలలను తనిఖీ చేసి, అఫిలియేషన్ ఇచ్చిన అనంతరం ప్రవేశాల ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ధ్రువపత్రాల పరిశీలనకు ఎంసెట్ కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో... ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశమయ్యారు. 
 
గత నాలుగేళ్లలో ఎప్పుడూ ప్రవేశాలు ఆగస్టు కంటే ముందు జరగలేదని ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి సీఎంకు తెలియజేశారు. ఉన్నత విద్యా మండలికి, ప్రభుత్వానికి మధ్య వివాదం వచ్చినపుడు... ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అవుతుందని ‘ఉన్నత విద్యామండలి చట్టం-1988’ సెక్షన్ 18 (2)లోనే ఉందని మంత్రి వివరించారు. ఆంధ్రా, ఇతర రాష్ట్ర విద్యార్థులకంటే తెలంగాణ విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్య అందిస్తామని... ఇందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని వివరించారు.