శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (19:14 IST)

వైఎస్ చనిపోతే జగన్‌కు సీఎం పోస్ట్ ఇచ్చారా?: హరీష్ రావు ప్రశ్న

నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్‌రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. నారాయణఖేడ్‌లో అభ్యర్థిని పోటీకి నిలిపి టీఆర్ఎస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు తుంగలో తొక్కిందన్నారు. 2015లో తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ చనిపోతే ఆయన భార్య సుగుణకు టీడీపీ టికెట్ ఇచ్చిందని, కానీ కాంగ్రెస్ ఏకగ్రీవంగా సహకరించకుండా తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది నిజం కాదా? అని హరీష్ రావు ప్రశ్నించారు. 
 
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందినపుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీఎం పదవిని ఇచ్చిందా? అని అడిగారు. విచిత్రమేమిటంటే.. కాంగ్రెస్‌తో పాటు టీడీపీ కూడా వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడటమేమిటని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎన్నికలంటే భయమని, అందుకే వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. టెక్కలి ఎమ్మెల్యే చనిపోతే టీడీపీ తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టలేదా అని అడిగారు. ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

2006లో తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ రాజీనామా చేస్తే సెంటిమెంట్‌ను గౌరవించకుండా ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే నారాయణ్‌ఖేడ్‌ను తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైపోయిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.