గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (21:21 IST)

తెలంగాణలో తెదేపా ఇక బతకదు... అందుకే తెరాసలో చేరా... ఎర్రబెల్లి

తెలంగాణలో ప్రజలు ఇక తెలుగుదేశం పార్టీ బతికే పరిస్థితి లేదనీ, అందువల్ల తను నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెరాసలో చేరినట్లు తెలంగాణ తెలుగుదేశం శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు చంద్రబాబు నాయుడు అంటే వ్యతిరేకత ఏమీ లేదని, ఆయనంటే తనకు చాలా ఇష్టమన్నారు. 
 
ఐతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితి వచ్చిందనీ, ఇక్కడ ఆ పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం లేదు కనుక ప్రజల మనోభావాలను అనుసరించి పార్టీ మారక తప్పలేదన్నారు. తనొక్కడినే కాదు మిగిలినవారు కూడా తెరాసలో చేరిపోయి తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇక తెలుగుదేశం కనుమరుగవుతుందనీ, ఆ పార్టీ మనుగడ సాధ్యం కాదని చెప్పుకొచ్చారు.
 
తను ఏ పదవిని ఆశించి పార్టీలో చేరలేదని తెలిపారు. వరంగల్ లేదా నిజాం గ్రౌండ్స్ లోపల భారీ బహిరంగ సభ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాస కండువా కప్పుకుంటామని ఎర్రబెల్లి తెలియజేశారు. తనకున్న సమాచారం ప్రకారం మరో ఇద్దరుముగ్గురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతారని తెలిపారు.