గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (18:53 IST)

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ పక్కా: తప్ప తాగితే కొత్త శిక్ష అదేంటి?

హైదరాబాదులో తప్పతాగి బండి నడిపారో ఇక అంతే సంగతులు. మద్యం తాగి వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. అలా మందుకొట్టి.. స్టీరింగ్ పట్టుకుని అభాగ్యుల ప్రాణాలతోపాటు తమ ప్రాణాలను సైతం గాలిలో కలిపేసే వారికి కొత్త శిక్ష అమలులోకి వచ్చింది.
 
సాధారణంగా హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్ పక్కాగా చేపడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తున్నారు. అలా దొరికిన మందుబాబులకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ న్యాయస్థానం విభిన్న శిక్ష విధించింది. ఇప్పటిదాకా ఫైన్ కట్టేసి ఊపిరిపీల్చుకుంటున్న బడాబాబులకు ఎర్రమంజిల్ కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం రుచించికపోవచ్చు. 
 
ఇంతకీ ఆ శిక్ష ఏంటంటే..? మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వర్తించాలని మందుబాబులను ఆదేశించింది. హైదరాబాదులో ఇకపై మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే ఈ ప్రత్యేక విధులు నిర్వర్తించక తప్పదని స్పష్టం చేసింది. తాజాగా, ఎర్రమంజిల్ కోర్టు 35 మంది మందుబాబులకు ఈ తరహా సామాజిక సేవా శిక్ష విధించడం చర్చనీయాంశమైంది.