గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (12:05 IST)

కమల దళాధిపతితో రాములమ్మ భేటీ... చేరిక ఎపుడో?

కమల దళాధిపతి జయ ప్రకాష్ నడ్డాతో సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి సోమవారం సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా విజయశాంతిని బీజేపీలో చేరాలని జేపీ నడ్డా సాదరంగా ఆహ్వానించినట్టు సమాచారం. 
 
మరోవైపు విజయశాంతిపై బండి సంజయ్ ఇటీవల ప్రశంసలు కురిపించారు. ఆమె ఒక గొప్ప నాయకురాలని కితాబిచ్చారు. అయితే, అందరు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసినట్టే ఆమెకు కూడా కేసీఆర్ అన్యాయం చేశారని విమర్శించారు. విజయశాంతి కూడా నిన్న బీజేపీకి మద్దతుగా ట్వీట్ చేశారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కాషాయ కండువాను విజయశాంతి కప్పుకోబోతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.
 
తెలంగాణ మహిళా ఫైర్‌బ్రాండ్ 
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిన సినీ నటి విజయశాంతి. ఈమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే, ఆ పార్టీలో ఉన్న నేతలతో ఆమెకు పొసగక... గత కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. అదేసమయంలో బీజేపీ ఆకర్ష్ పేరుతో కమలనాథులు ఆమెకు గాలం వేశారు. ఆమెతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. దీంతో బీజేపీలో చేరేందుకు ఆమె ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
తాజాగా సమాచారం మేరకు.. ఈ నెల 24వ తేదీలోపు ఆమె బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి అమిత్‌షా సమక్షంలో కాషాయకండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చేయిదాటిపోయిందని విజయశాంతి కామెంట్‌ చేయడమే దీనికి సంకేతమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
 
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌ ఇంకా ముందు వచ్చి ఉంటే.. కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగయ్యేదేమోనన్న ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కాంగ్రెస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. తెరాస పార్టీ భయబ్రాంతులకు గురిచేసి నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోందని విజయశాంతి ఆరోపించారు. తెరాసకు సవాల్‌ విసిరే స్థాయికి బీజేపీ వచ్చిందని రాములమ్మ చెబుతున్నారు.
 
కాగా, రాములమ్మ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే, వాస్తవానికి ఈమె బీజేపీతోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. భారతీయ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి.. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్‌ఎస్ నుంచి 2009 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 
 
టీఆర్‌ఎస్‌తో విభేదాలు రావడంతో 2014లో కాంగ్రెస్‌లో చేరారు. అయితే విజయశాంతి స్టార్ ఇమేజ్ కలిసి వస్తుందని బీజేపీ గంపెడాశతో ఎదురు చూస్తోంది. బీజేపీ ఆశలు త్వరలోనే ఫలించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అంతిమంగా రాములమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.