శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pyr
Last Updated : బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (06:34 IST)

కేసీఆర్ బ్లూప్రింట్ సూపర్.. 14వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్!

తెలంగాణ రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం చేసిన నిధుల సిఫార్సులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెదవి విరుస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు భేష్‌. ఆయన రూపొందించిన బ్లూప్రింట్‌, విజన్‌ డాక్యుమెంట్‌ చాలా బాగున్నాయంటూ. సీఎం కేసీఆర్‌, ఇతర అధికారులతో సమావేశమైన అనంతరం 14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ డాక్టర్‌ వై.వి.రెడ్డి ప్రశంసలు కురిపించారు. దీంతో భారీ ఎత్తున నిధులు కేటాయింపులు జరుగుతాయని కేసీఆర్ అండ్ కో ఆశలు పెట్టుకుంది. కానీ, చివరకు నిరాశే మిగిలింది. 
 
మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆర్థిక సంఘం సిఫారసులు చూసి తెలంగాణ ప్రభుత్వం విస్తుపోయింది. తమ విన్నపాలన్నీ బుట్టదాఖలయ్యాయంటూ ఆక్రోశిస్తోంది. ఏటా కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వచ్చే వాటా, కేంద్ర పథకాలకు వచ్చే గ్రాంట్లకు అదనంగా... కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధికి కనీసం 70 వేల కోట్లు అందించాలని ఆర్థిక సంఘాన్ని కేసీఆర్‌ కోరారు. 
 
‘తెలంగాణలోని పది జిల్లాల్లో ఆరు తీవ్ర కరువు జిల్లాలు. కొన్ని జిల్లాల్లో ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ అభివృద్ధి, వికాసానికి చేపట్టిన మిషన్‌ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌ తదితర కార్యక్రమాలతోపాటు ఎస్సీ, ఎస్టీల భూముల పంపిణీ, రైతుల రుణమాఫీ పథకాల అమలుకు కేంద్రం నుంచి అదనంగా రూ.70 వేల కోట్లు కావాలి’ అని విజ్ఞప్తి చేశారు. 
 
తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీని సిఫారసు చేయాలని, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి అదనపు సాయం చేయాలని కోరారు. ఈ విన్నపాలన్నింటినీ ఆర్థిక సంఘం తోసిపుచ్చింది. ఐదేళ్లలో రూ.20,951 కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని కోరగా... రూ.10,128 కోట్లతో సరిపెట్టింది. పైగా... నిధుల మంజూరులో అసమంజసమైన ప్రాతిపదికలు పాటించడంతో తెలంగాణకు రావాల్సిన నిధులు కూడా రాకుండా పోయాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 
 
తెలంగాణను మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా చూపించి, ఎలాంటి అదనపు సాయాన్ని సిఫారసు చేయకపోవడం దారుణమని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆర్థిక శాఖ అధికారులతో కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 40 శాతానికి పైగా ఉండాలని కేసీఆర్ కోరగా.. ఇపుడు కేంద్రం 42 శాతం ఇచ్చేందుకు సమ్మతించింది. ఈ ఒక్క విన్నపం మాత్రమే సానుకూలంగా ఉండగా, మిగిలిన విన్నపాలు వృథా అయ్యాయని అధికార వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.