బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (09:16 IST)

సిరిసిల్ల రాజయ్య కోడలిది ముమ్మాటికీ ఆత్మహత్యే .. ఫోరెన్సిక్ నివేదిక

సిరిసిల్ల రాజయ్య కోడలిది ముమ్మాటికీ ఆత్మహత్యేనని ఫోరెన్సిక్ నిపుణులు తమ నివేదికలో స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) నిపుణులు గురువారం ఈ మేరకు వరంగల్‌ పోలీసులకు నివేదికను పంపించారు. 
 
కాగా, ఈ నెల 4వ తేదీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక (35), మనవళ్లు అభినవ్ ‌(7), ఆయాన్ (3), శ్రీయాన్ (3)లు అనుమానాస్పద స్థితిలో మంటల్లో సజీవదహనమైన విషయం తెల్సిందే. రాజయ్య ఇంట్లో జరిగిన ఈ ఘటనపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. గ్యాస్‌లీక్‌ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ.. ఘటనా స్థలం నుంచి వస్తువులను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించి పరీక్ష జరిపించారు. 
 
ఎంజీఎంలో పోస్టుమార్టం సమయంలో కూడా విస్రా టెస్టు కోసం శరీర భాగాల నుంచి నమూనాలను సేకరించారు. పోలీసులు పంపిన శాంపిల్స్‌పై ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌లో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో 20 రోజుల పాటు పరీక్షలు జరిపిన నిపుణులు చివరకు వారు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు నివేదిక రూపొందించి వరంగల్‌ పోలీసులకు పంపారు.
 
అయితే, ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌కుమార్‌, అనిల్‌ రెండో భార్య వరంగల్‌ కేంద్ర కారాగారంలో ఉన్నారు. రాజయ్య బెయిల్‌ కోసం పిటిషన్‌ను దాఖలు చేసినా కోర్టులో చుక్కెదురైంది. సారిక, ఆమె ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ.. వారి ఆత్మహత్యకు మాత్రం రాజయ్య, ఈయన భార్య, సారిక భర్త వేధింపులే కారణం కావడంతో వారిపై ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.