శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (10:34 IST)

ఓటుకు నోటు కేసు : నోడౌట్.. ఆ వాయిస్‌ వారిదే.. ఎఫ్ఎస్ఎల్ నివేదిక

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెను చిచ్చుకు కారణమైన ఓటుకు నోటు కేసు శుక్రవారం కీలక మలుపు తిరిగింది. నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు బేరసారాలు సాగించిన ఆడియో టేపుల్లో ఉన్నది టీ టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలతో పాటు.. మధ్యవర్తి జెరూసలెం మత్తయ్యలదేనని హైదరాబాద్ ఫోరెన్సిక్ నివేదిక (ఎఫ్ఎస్ఎల్) తేల్చింది. దీంతో ఓటుకు నోటు కేసు మరోమారు తెరపైకి వచ్చింది. 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్ ఓటును కొనుగోలు చేసేందుకు టీ టీడీపీ యత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ముట్టజెబుతూ తెలంగాణ అసెంబ్లీలో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. స్టీఫెన్‌సన్ ఇంటిలోనే రేవంత్ రెడ్డిని తెలంగాణ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత టీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కోర్టు నుంచి బెయిల్ పొందిన వీరిద్దరూ బయటే ఉన్నారు.
 
ఈ క్రమంలో సాక్ష్యాలుగా సేకరించిన ఆడియో టేపుల్లోని వాయిస్‌లను నిర్ధారించుకునేందుకు వాటిని ఏసీబీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపింది. వీటిపై సుదీర్ఘంగా పరిశీలన జరిపిన ఫోరెన్సిక్ నిపుణులు గురువారం తమ నివేదికను టీ ఏసీబీ అధికారులకు అందజేశారు. ఆడియో టేపుల్లోని వాయిస్‌లు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన జెరూసలెం మత్తయ్యలవేనని నిర్ధారించారు. 
 
ఈ కేసు దర్యాప్తులో కీలక సాక్ష్యాలుగా పరిగణిస్తున్న ఆడియో, వీడియో టేపుల విశ్లేషణ పూర్తయిన నేపథ్యంలో ఈ కేసులో అదనపు చార్జిషీట్ దాఖలుకు ఏసీబీ సమాయత్తమవుతున్నట్లు సమాచారం. మరోవైపు.. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వాయిస్ శాంపిల్స్ కూడా సేకరించి, ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.