గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (09:43 IST)

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో గద్దర్... లెఫ్ట్ పార్టీ నేతల యత్నాలు?

తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీకి చెక్ పెట్టేందుకు లెఫ్ట్ పార్టీలు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్‌ను బరిలోకి దించాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ పార్టీ ప్రధాన కార్యాలయంలో వామపక్షాలకు చెందిన 10 పార్టీలు మంగళవారం సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో గద్దర్‌ను నిలబెట్టాలనే విషయంపై చర్చించారు. గద్దర్‌ను నిలబెడితే విజయం సాధిస్తామని వామపక్ష నేతలు గట్టిగా భావిస్తున్నాయి. తెలంగాణ పోరాటంలో గద్దర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్న పార్టీలు ఆయనను వామపక్ష పార్టీల అభ్యర్థిగా బరిలోకి దించాలని భావిస్తున్నాయి. 
 
ఇదే అంశంపై గద్దర్‌ను ఒప్పించేందుకు కూడా ఆ పార్టీ నేతలు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం గద్దర్‌తో కూడా చర్చలు కుడా జరిపారు. దీనిపై గద్దర్ తనదైనశైలిలో స్పందించారు. లెఫ్ట్ పార్టీల నేతలు తనను కలిసిన మాట వాస్తవమేనని గద్దర్ వెల్లడించారు. తన రాజకీయ రంగప్రవేశాన్ని కాలమే నిర్ణయిస్తుందన్నారు. దీనిపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రజలు కోరుకుంటే రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆలోచిస్తానని గద్దర్ స్పష్టం చేశారు. లెఫ్ట్ పార్టీలు నేతలు చేస్తున్న ప్రయత్నాలతో వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఇపుడు ఆసక్తికరంగా మారింది.