గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 30 జూన్ 2015 (12:35 IST)

ఆయన 'దూకుడు'ను ఎవ్వరూ అడ్డుకోలేరు... మేమే అక్కడికెళ్తాం... రేవంత్ భార్య

రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీస్తారని అనుకున్నాం కానీ ఇలా వ్యక్తిగతంగా ఇరికిస్తారని అనుకోలేదని రేవంత్ రెడ్డి సతీమణి గీతా వెల్లడించారు. రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా రేవంత్ రెడ్డిగారి దూకుడుకు ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరని ఆమె అభిప్రాయపడ్డారు. కష్టకాలంలో తమకు మద్దతుగా ఉన్న కార్యకర్తలు, ఇంకా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.
 
రేవంత్ రెడ్డిని కొడంగల్ నియోజకవర్గానికే పరిమితం కావాలని కోర్టు ఆదేశించిన నేపధ్యంలో తాము అక్కడికే వెళతామని అన్నారు. కార్యకర్తలు హైదరాబాదుకు వచ్చే బదులు తామే అక్కడికి వెళతామని చెప్పారు. మరోవైపు రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకుల సంగతేమోగానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ మంత్రులు పండుగ చేసుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు రేవంత్ బెయిల్ విషయం తెలియగానే స్వీట్లు తెప్పించి ఆయన కూడా తిన్నారు. బ్రదర్ రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందని తాను విశ్వసించాననీ, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డిని కేసులో ఇరికించారని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఇదిలావుండగా రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా సస్పెన్షన్ వేటు వేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోందన్న వార్తల నేపధ్యంలో రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే టి.టిడిపి నాయకులు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి బెయిల్ లభించినందుకు కుటుంబసభ్యులు ఆనందోత్సాహాలతో ఉన్నారు.