మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Modified: సోమవారం, 28 జులై 2014 (20:48 IST)

జీహెచ్ ఎంసీ ఎన్నికలపై టీకాంగ్ దృష్టి

బల్దియా ఎన్నికలపై టీ-కాంగ్ నేతలు దృష్టిపెట్టారు. ఒంటరి పోరుకే మెజార్టీ లీడర్లు మొగ్గు చూపుతున్నారు. ఎన్నికల ఓటమిపై తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్‌గా పోస్టుమార్టమ్చేస్తోంది. ఇక ముఖ్యనేతల మధ్య ఉన్న అనైక్యత మొన్నటి పార్టీ ఓటమికి ప్రధానకారణమైందని నేతలు అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్టులద్వారా నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామన్న విషయాన్ని పీసీసీ పెద్దలు కూడా ఏకీభవించినట్లు సమాచారం.
 
ఇప్పటికే నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షనిర్వహించిన టీ-పీసీసీ చీఫ్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టిపెట్టారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. జంటనగరాల్లో పార్టీ పరిస్థితిపై పొన్నాల ఆరా తీశారు. 
 
మరోవైపు సిటీ లీడర్లు మాత్రం టీ-పీసీసీ చీఫ్ ముందు సమస్యలను ఏకరువు పెట్టారు. పార్టీ కోసం పని చేసిన నేతలనుకాదని అడ్రస్ లేని లీడర్లకు టిక్కెట్లు కట్టబెట్టారని మండిపడ్డారు. ఇక పొత్తులపై కూడాకుండబద్దలు కొట్టారు. ఎంఐఎం పొత్తుతో పాతబస్తీలో పార్టీకి నష్టం జరిగిందని అన్నారు.ఇకనైనా ఒంటరిగావెళ్లి మన సత్తా ఏంటో చూపిద్దామని పలువురు గ్రేటర్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. 
 
జీహెచ్ ఎంసీ ఎన్నికలు తరుముకొస్తుండటంతో పూర్తిస్థాయిలో పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు హస్తం పార్టీ సిద్ధమవుతోంది. ఒకవైపు సమీక్షలతో టీ-పీసీసీ బిజీగా ఉన్నా గ్రేటర్ లీడర్లు ముఖేష్, విహెచ్, శశిధర్ రెడ్డి, విష్ణు వర్థన్ రెడ్డి డుమ్మాకొట్టారు. మరి ఈ పరిస్థితుల్లో నేతల మధ్య ఐక్యత సాధ్యమేనా? అనే ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.