గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (10:19 IST)

గ్రేటర్ హైదరాబాద్‌లో 6.3 లక్షల ఓట్లు తొలగింపు.. అంతా సీమాంధ్రులవేనా?

గ్రేటర్ హైదరాబాద్ బరిధిలో 6.3 లక్షల ఓట్లను తొలగించారు. మరో 19 లక్షల ఓట్లను తొలగించేందుకు నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులకు స్పందన రాకుంటే వాటిని కూడా తొలగించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. కాగా, ప్రస్తుతానికి తొలగించిన ఓట్లన్నీ సీమాంధ్రులకు చెందిన ఓట్లుగా భావిస్తున్నారు. ఈ సందేహాన్ని విపక్ష పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. 
 
వాస్తవానికి గ్రేటర్ పరిధిలో ఓటర్ల తొలగింపుపై గత కొన్ని రోజులుగా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ విపక్ష పార్టీలకు అనుకూలమైన నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 
 
ఓటర్ల తొలగింపు అంశంపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో మూడు జిల్లాల పరిధిలోని గ్రేటర్‌ హైదరాబాద్‌లో త్వరలో మరో 19 లక్షల మంది ఓటర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. గతంలో 10.30 లక్షల మందికి నోటీసులు జారీశామని, నోటీసులకు స్పందించని 6.30 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించామని వివరణ ఇచ్చారు. 
 
ఓటర్ల జాబితాలో పేర్కొన్న చిరునామాల్లో వారు లేకపోవడంతో నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. జాబితాలో పేర్కొన్న చిరునామాల్లో లేనివారికి జారీ చేస్తున్న ఈ నోటీసులకు సంబంధిత ఓటర్లు ఏ విధంగా సమాధానం ఇస్తారనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... కొత్త చిరునామాలు తెలియనప్పుడు తాము ఇంతకుమించి చేసేదేమీ ఉండదన్నారు.